దగా బడ్జెట్!

11 Mar, 2016 03:26 IST|Sakshi
దగా బడ్జెట్!

జిల్లాకు తీరని అన్యాయం
 
డోన్‌లో మైనింగ్ స్కూల్ఏర్పాటుకు లభించని హామీ
ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులు
ప్రతిపాదనలన్నీబుట్టదాఖలే..
స్వయంగా సీఎం ఇచ్చిన హామీలకే నిధుల్లేవు

 
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు:
  ‘‘నేనూ రాయలసీమలో పుట్టినవాడినే. నా శరీరంలోనూ ప్రవహించేది రాయలసీమ రక్తమే. అలాంటిది రాయలసీమకు అన్యాయం చేస్తానా’’ అని ఆవేశంగా మాట్లాడిన సీఎం.. బడ్జెట్‌లో ఏ మాత్రం కనికరం చూపలేదు. కర్నూలు జిల్లాకు బడ్జెట్‌లో అడుగడుగునా అన్యాయమే కనిపించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలకూ బడ్జెట్‌లో దిక్కులేకుండా పోయింది. డోన్‌లో మైనింగ్ స్కూలు ఏర్పాటు చేస్తానని 2014 ఆగస్టు 15న కర్నూలు నగర నడిబొడ్డున హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం(2016-17)లో తరగతులు కూడా ప్రారంభిస్తామన్నారు. అయితే, అటు బడ్జెట్ ప్రసంగంలో కానీ.. ఇటుబడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఆ మాటే లేకపోయింది. అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజనులో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జూన్ నాటికి పూర్తి చేసి నీళ్లు ఇస్తామని గతంలో సీఎం ప్రకటించారు. అయితే, ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులతోనే సరిపెట్టారు. మొత్తంగా ఉర్దూ యూనివర్సిటీకి రూ.20 కోట్లు కేటాయింపు తదితర పైపై పూతలే తప్ప జిల్లాకు బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 ప్రాజెక్టులకు అరకొర విదిలింపులే..
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, కేటాయింపులకు బడ్జెట్‌లో ఏ మాత్రం పొంతన లేకపోవడం గమనార్హం. మొత్తం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.190 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి ఇది కూడా తక్కువే. ఉన్నతస్థాయి అధికారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో నామమాత్రంగానే జిల్లా సాగునీటిశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. వీటికి కూడా మోక్షం లభించలేదు. ఇందులో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.20 కోట్లు, జీడీపీ(గాజులదిన్నె)కి రూ.1.15 కోట్లు, కేసీ కెనాల్ ఆధునికీరణకు రూ.50.94 కోట్లు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునీకరణకు రూ.6 కోట్లు, ఎస్‌ఆర్‌బీసీకి రూ.56 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనల్లో కోరారు. అయితే, ఎస్‌ఆర్‌బీసీకి రూ.43.05 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక కేసీ కెనాల్ ఆధునికీకరణకు రూ.38 కోట్లతో సరిపెట్టారు.


 బాబూ.. వీటి మాటేమిటి!
 ఇక డోన్ మైనింగ్ స్కూలుకు ఒక్క పైసా కేటాయించని ప్రభుత్వం.. సీఎం హామీ ఇచ్చిన ఓర్వకల్లు-మిడుతూరు రోడ్డుకు రూ.1.50 కోట్ల కేటాయింపుపైనా బడ్జెట్‌లో స్పష్టత లేదని తెలుస్తోంది. కేవలం ఉర్దూ యూనివర్సిటీకి రూ.20 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కర్నూలు నగరం వెలుపల అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు కూడా అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే, బడ్జెట్‌లో వీటికీ మోక్షం లభించలేదు. మొత్తంగా జిల్లాకు హామీ మేరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు లేకపోవడం పట్ల జిల్లా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు