పాచి పట్టిన ‘దంత’ నిధులు

23 Feb, 2019 13:40 IST|Sakshi
కడప పాత రిమ్స్‌లోని జిల్లా వైద్య విధాన పరిషత్‌ కార్యాలయం

సీహెచ్‌సీలకు రూ.59 లక్షలు మంజూరు

ఏదాది దాటినా ఖర్చు పెట్టని వైనం

మూలుగుతున్న ’నేషనల్‌ ఓరల్‌ హెల్త్‌ ప్రోగ్రాం’ బడ్జెట్‌

కడప రూరల్‌:  నిధుల్లేక.. ఉన్నా అవి విడుదల కాక చాలా ప్రభుత్వ శాఖలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. ఇందులో వైద్య రంగాన్ని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఓరల్‌ హెల్త్‌ ప్రోగ్రాం’ కింద  దంత చికిత్స విభాగానికి రూ.59 లక్షలు కేటాయించింది. ఈ బడ్జెట్‌ను  జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్‌ శాఖ పరిధిలోని సీహెచ్‌సీ మ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌)లకు కేటాయించింది. అయితే ఏడాది దాటినా ఆ నిధులను ఖర్చు చేయడానికి ఎందుకు చేతులు ఆడడంలేదో అర్థం కావడంలేదు.

11సీహెచ్‌సీలకు రూ.59 లక్షలు మంజూరు
జిల్లా వైద్య విధాన పరిషత్‌ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రొద్దుటూరులో జిల్లా ఆసుపత్రి, పులివెందులలో ఏరియా హాస్పిటల్‌ ఉన్నాయి. అలాగే ఒకొక్కటి చొప్పున మైదుకూరు, సిద్దవటం, పోరుమామిళ్ల, బద్వేల్, రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వేంపల్లె, కమలాపురం, జమ్మలమడుగు, చెన్నూరు కలిపి మొత్తం 14  సీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో లక్కిరెడ్డిపల్లె, సిద్దవటం, చెన్నూరు సీహెచ్‌సీలను మినహాయిస్తే, ఒక సీహెచ్‌సీకి రూ.5.36 లక్షల ప్రకారం మొత్తం 11 సీహెచ్‌సీలకు దాదాపు రూ.59 లక్షలు మంజూరైంది.

2018 ఫిబ్రవరిలో మంజూరైన నిధులు  
ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఈ నిధులతో ఆయా సీహెచ్‌సీల్లోని ‘దంత వైద్యం’ విభాగానికి ఖర్చు చేయాల్సి ఉంది. అంటే డెంటల్‌ ఛైర్, దంత వైద్యం పరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం ఖర్చు చేయాలి. అంటే దంత వైద్యానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ప్రధాన లక్ష్యం. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన నిధులను ఆ శాఖ ఇంతవరకు ఖర్చు చేయకపోవడం దారుణం. కాగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ నిధులను ఎప్పుడో ఖర్చు పెట్టేశారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో మాత్రం ఖర్చు పెట్టకుండా ఎందుకు పొదుపు చేస్తున్నారో అర్థం కావడం లేదు.

25శాతం రోగులకు దంత సమస్యలే
ప్రతి సీహెచ్‌సీలో రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు ప్రతి సీహెచ్‌సీకి వందకు పైగా రోగులు వస్తున్నారు. ఇందులో దాదాపు 25 శాతం మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో దంత సంరక్షణ ఎంతో కీలకం. ఇలాంటి  విభాగానికి ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వచ్చిన నిధులను ఖర్చు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై ఆ శాఖ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ పద్మజను వివరణ కోరగా.. తాను బిజీగా ఉన్నానని, ఏదైనా ఉంటే చాంబర్‌కు వచ్చి కనుక్కోండని సూచించారు.

మరిన్ని వార్తలు