నమ్మించి.. నట్టేటముంచి..!

21 Aug, 2014 03:18 IST|Sakshi
నమ్మించి.. నట్టేటముంచి..!
  •    బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకు అత్తెసరు నిధులు
  •      పేద ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసిన వైనం
  •      కలినరీ ఇన్‌స్టిట్యూట్, విమానాశ్రయ విస్తరణపై గొప్పలు
  •      తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు బడ్జెట్లో చోటు దక్కని పరిస్థితి
  •      తిరుపతిలో ఐటీఐఆర్ ఏర్పాటుకు నిధులు కేటాయింపు లేదు
  •      స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుకు నిర్ణయం
  •      ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ప్రతిపాదన
  •      స్విమ్స్‌ను కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని హామీ
  •      జిల్లాపై రాష్ట్ర బడ్జెట్ ప్రభావం ఇదీ
  • సీఎం చంద్రబాబు జిల్లా ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు. శాసనసభలో బుధవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ ప్రతిపాదనలే అందుకు తార్కాణం. పంట, డ్వాక్రా రుణాల మాఫీకి బడ్జెట్‌లో ఒక్క పైసా నిధులను కేటాయించలేదు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం కల్పించే హామీల అమలు ఊసే బడ్జెట్లో కన్పించలేదు. జిల్లాను సుభిక్షం చేసే నీటిపారుదలశాఖ ప్రాజెక్టులకు అత్తెసరు నిధులు కేటాయించి.. రైతుల ఆశలను అడియాసలు చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్, రేణిగుంట విమానాశ్రయ విస్తరణ పనులు తామే చేస్తున్నట్లు నమ్మించేలా బడ్జెట్‌లో ప్రస్తావించారు.             
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: పంట, డ్వాక్రా రుణాల మాఫీ.. నిరుద్యోగులకు నెలకు రూ.రెండు వేల నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున రుణమాఫీ చేస్తానని.. డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని చేతులెత్తేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున పెట్టుబడి కింద అందిస్తామన్నారు.

    వీటికి బడ్జెట్లో ఒక్క పైసా నిధులను కూడా కేటాయించకపోవడంతో 8.70 లక్షల మంది రైతులు, 5.65 లక్షల మంది డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. గృహ నిర్మాణశాఖకు దివంగత వైఎస్ హయాంలో ఏటా రూ.ఏడు వేల నుంచి రూ.ఎనిమిది వేల కోట్లు కేటాయించేవారు. ఈ బడ్జెట్‌లో చంద్రబాబు సర్కారు కేవలం రూ.808 కోట్లు కేటాయించింది. జిల్లాలో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ.18 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గృహ నిర్మాణానికి అత్తెసరు నిధులు కేటాయించి నిరుపేదల సొంతింటి స్వప్నాన్ని చంద్రబాబు కాలరాశారు.
     
    అంతా తమ గొప్పేనని చాటేయత్నం..

    తిరుపతిలో రూ.50 కోట్లతో ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తామని గత కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. నిధులు కూడా కేటాయించింది. ఇ ప్పుడు ఆ సంస్థను తామే ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొనడం విడ్డూరం.
         
    రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులను రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టడానికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఇప్పటికే సాగుతున్నాయి. కానీ.. రేణిగుంట విమానాశ్రయాన్ని తామే విస్తరిస్తున్నామని బడ్జెట్లో పేర్కొన్నారు.
         
    చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఐఐఐటీ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. శ్రీసిటీ సెజ్‌కు అనుబంధంగా గతేడాదే ట్రిపుల్ ఐటీని ఏర్పాటుచేశారు. గతేడాది మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల హైదరాబాద్‌లో తరగతులు ప్రారంభించారు. ఇటీవల శ్రీసిటీలోకి ట్రిపుల్ ఐటీని మార్చారు. దాన్ని కూడా చంద్రబాబు సర్కారు తమ గొప్పగా చెప్పుకుంటోంది.
         
    {పధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద స్విమ్స్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. అదే అంశాన్ని రాష్ట్ర బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి యనమల పేర్కొనడం గమనార్హం.
         
    తిరుపతిలో రూ.117 కోట్లతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, రూ.12 కోట్లతో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
         
    తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్పర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ఏర్పాటుచేసి.. ఐటీ హబ్‌గా మా ర్చుతామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటాయించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఐటీ పరిశ్రమలు ఎలా ఏర్పాటవుతాయన్నది చంద్రబాబుకే ఎరుక. ఇక కుప్పంలో మా త్రం ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు బడ్జెట్‌లో స్థానం కల్పించడం గమనార్హం.
     
    సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం..

    జిల్లాలో 3.15 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి, 87,734 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి, 12 లక్షల మందికి తాగునీటిని అందించడానికి దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టులను చేపట్టారు. ఆయన హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో అత్తెసరు నిధులే కేటాయించడంతో ప్రాజెక్టుల పనులకు ‘చంద్ర’గ్రహణం పట్టుకుంది.
         
    జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు హంద్రీ-నీవా కింద నీళ్లందించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా రూ.5,100 కోట్ల మేర ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేశారు. మరో రూ.1750 కోట్ల విలువైన పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టుకు 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కిరణ్ సర్కా రు రూ.416 కోట్లను కేటాయించింది. ఇప్పుడు కనీసం రూ.750 కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ.. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.100.28 కోట్లనే కేటాయించారు. దీంతో మన జిల్లాకు నీళ్లందించే హంద్రీ-నీవా రెండో దశ పనులు ఆగిపోయినట్లే లెక్క..!
         
    గాలేరు-నగరి ప్రాజెక్టు కింద జిల్లాలో 1.03 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. కిరణ్ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.321.50 కోట్లు కేటాయించింది. ఇప్పుడు  పూర్తి స్థాయి బడ్జెట్లో కనీసం రూ.550 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించగా.. కేవలం రూ.55.14 కోట్లనే కేటాయించింది.
         
    తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 49 వేల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలంటే మరో రూ.700 కోట్లు అవసరం. కిరణ్ సర్కారు ఈ ప్రాజెక్టుకు రూ.154 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కనీసం రూ.334 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం రూ.89.60 కోట్లను మాత్రమే మంజూరు చేసింది.
         
    సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా 87,734 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు కొత్తగా 23,666 ఎకరాల ఆయకట్టుకు మన జిల్లాలో నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.300 కోట్లు. అటవీ భూవివాదం పరిష్కారం కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్లో కనీసం రూ.150 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. అంటే.. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు ఆగిపోయినట్లే లెక్క..!
     

మరిన్ని వార్తలు