అంతా దాచిపెట్టే ప్రయత్నమే: వైఎస్ జగన్

12 Mar, 2015 14:56 IST|Sakshi
అంతా దాచిపెట్టే ప్రయత్నమే: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్ అంతా దాచిపెట్టే ప్రయత్నమే తప్ప.. ఏమీ కనిపించే అవకాశాల్లేవని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీ అని చెప్పాల్సి వస్తోందన్నారు. బడ్జెట్లో అన్నీ సత్యదూరమైన మాటలేనని, అన్నీ కవరప్ చేసుకునే ఆలోచనలేనని ఆయన అన్నారు. ఫలానా పథకానికి గొప్పగా కేటాయింపులు చేశామని చెప్పుకొనే పరిస్థితి లేదని చెప్పారు. బడ్జెట్ అంశాలపై పూర్తిగా ఇంకా లోతుల్లోకి వెళ్లలేని, దీనిపై 16వ తేదీన ప్రసంగం చేస్తానని వైఎస్ జగన్ తెలిపారు. కొత్తగా జీరో బేస్డ్ బడ్జెట్ అన్నారు గానీ, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేశామన్నారు. అప్పుడు జీరో బేస్డ్ బడ్జెట్ విఫలం కావడంతో ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారని గుర్తుచేశారు.

వ్యవసాయ రుణాలకు ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వబోతారో చెప్పలేదని, శాఖల వారీగా రెవెన్యూ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు చేశారన్నది లోతుగా చూడాల్సి ఉందని వైఎస్ జగన్ అన్నారు. ఆర్థికలోటు రూ. 20 వేల కోట్లు అన్నారు గానీ, ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం 3 శాతం జీఎస్డీపీ కన్నా రుణం తెచ్చుకునే అవకాశం ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. మరి రూ. 20 వేల కోట్లు అంటే.. మూడు శాతం దాటినట్లే కదా అని విశ్లేషించారు. అలాగే, డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ ఎంతో లేదని, గతం గురించి చెప్పారు గానీ, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో చెప్పలేదని అన్నారు.

మరిన్ని వార్తలు