ప్రపంచ బ్యాంకు నిధులపై బుగ్గన కీలక ప్రకటన

22 Jul, 2019 13:29 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రెండుసార్లు అమరావతిలో పర్యటించారు

ఇక్కడి అవినీతిపై రైతులు, ఎన్జీవోలు వారికి ఫిర్యాదు చేశారు

ప్రపంచ బ్యాంకు జోక్యంపై కేంద్రం అభ్యంతరం

నవరత్నాలకు ఆర్థిక సహాయం

నిధులపై అసెంబ్లీలో బుగ్గన వివరణ

సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంకు నిధులపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ నిధులపై సోమవారం మంత్రి వివరణ  ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉందని, రూ. 5వేల కోట్లు సాయమందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీలో ఆయన కీలక ప్రకటన చేశారు. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారని, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారని వివరించారు. అయితే తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకానికి ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

సభలో బుగ్గన ప్రకటన వివరాలు.. ‘‘అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు మద్దతు ఉంటుంది. అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి సహాయం కోరుతూ ఏపీ ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 8న ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రాజెక్టు ప‍్రతిపాదన కోసం చేసిన అభ్యర్థన మే 25 2017న పునరుద్ధరించబడిన తరువాత జూన్‌లో నమోదు చేయబడింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా మోలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నుంచి నిధుల కోసం రుణ ప్రతిపాదనను డీఆఏ క్లియర్‌ చేసింది.

అయితే నూతన రాజధాని నగర అభివృద్ధి నమూనా వల్ల కలిగే ప్రతికూల, పర్యావరణ సామాజిక, ఆర్థిక ప్రభావావలకు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిదని అన్ని విధాలుగా స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వ చర్యలు భారతదేశాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుకు ఆమోదించక పూర్వమే, స్వతంత్ర బృందం దర్యాప్తు చేయాలని సిఫారసు చేసింది. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడి దోపిడి చూసి ప్రపంచ బ్యాంకు బయపడింది. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు. ప్రపంచ బ్యాంకు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారు. అయితే తాజాగా అమరావతి మానవ అభివృద్ధి ప్రాజెక్టుకు పూర్తి సహాకారం అందిస్తామని వివరించింది’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు