రాష్ట్రానికి సీఎం చేసిందేమీ లేదు

23 Nov, 2018 13:23 IST|Sakshi
యంబాయి గ్రామంలో రైతులతో మాట్లాడుతున్న పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

విదేశీ యాత్రలతో ప్రజాధనం వృథా

పీఏసీ చైర్మన్‌ బుగ్గన ధ్వజం

కర్నూలు, బేతంచెర్ల:  రాజధాని పేరుతో హడావుడి,  విదేశీ యాత్రలు మినహా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.  గురువారం ఆయన మండల పరిధిలోని యంబాయి గ్రామంలో  రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఇంతవరకు  రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. పైగా చంద్రబాబు  రైతుల రుణాలు మాఫీ చేశామని,  నిరుద్యోగ భృతి ఇస్తున్నామంటూ  ప్రచార ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆయనది ఐరన్‌లెగ్‌ కనుక రాష్ట్రంలో ఆయన పాలన కొనసాగినంత కాలం అతివృష్టి, అనావృష్టి తప్పవన్నారు.  వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కడితే  రైతుల శ్రేయస్సుకు పాటుపడతామన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన తొమ్మిది గంటల విద్యుత్, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన లేదా ఆత్మహత్య చేసుకున్న  రైతు కుటుంబానికి  వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా  ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు యుగంధర్‌రెడ్డి, శశికుమారప్పతో పాటు సీతారామాపురం ఎంపీటీసీ సభ్యుడు జయప్రకాశ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మునేశ్వర్‌రెడ్డి, వేణుగోపాలు రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు