అభివృద్ధి.. సంక్షేమంతో నవశకం

17 Jun, 2020 04:09 IST|Sakshi

నవరత్నాలతో అందరికీ వెలుగులు

రైతు భరోసా, ఆర్బీకేలతో అన్నదాతలకు ధీమా

అన్ని ప్రాంతాలకు సాగునీటి ప్రాజెక్టులు

పరిశ్రమలతో ఉపాధి బాటలు

బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

‘వడ్డించే వాడు మనోడైతే పంక్తిలో ఎక్కడ కూర్చుంటేనేం’ అన్న జగమెరిగిన సామెత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజానీకానికి అతికినట్లు సరిపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ నా వాళ్లే అనుకున్న మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలనలో ఎవరికి ఏమి కావాలో.. ఎంత కావాలో.. వారు అడక్కుండానే విస్తర వేసి విందు భోజనం వడ్డిస్తున్నారు. తాడిత, పీడిత, బడుగు, బలహీన, మైనార్టీ, ఇతర వర్గాల్లోని పేదలందరి అభ్యున్నతే లక్ష్యంగా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా 2020–21 బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ‘ల’కేత్వమివ్వనేరడు.. ‘ద’కును కొమ్మివ్వనేరడు.. (‘లేదు’ అని చెప్పలేకపోవడం) అన్నట్లు సర్వ జన రంజకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని దృఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట వేసింది. రైతులు, కౌలు రైతులు, తల్లులు, యువత, బడుగు వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడానికి అంచనాలకు మించి ప్రభుత్వం కృషి చేస్తోంది.
– ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

సాక్షి, అమరావతి: అన్ని రంగాల సమగ్రాభివృద్ధి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాల ద్వారా రాష్ట్రంలో నవశకం ఆవిష్కరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి బాటలు, అన్ని ప్రాంతాలకు సాగునీటి వనరుల కల్పన, విద్యా వెలుగులు, అందరికీ ఇళ్లు, నాడు – నేడు ద్వారా ఆస్పత్రులు, పాఠశాలల రూపురేఖల మార్పు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో ఆర్థిక ప్రగతి లక్ష్యాలుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 90 శాతంపైగా హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేయడాన్ని బట్టే  ఇచ్చిన మాట నెరవేర్చుకోవడంపై మా ప్రియతమ నేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఎంత నిబద్ధత ఉందో అందరికీ స్పష్టంగా అర్థమైందని బుగ్గన వివరించారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,24,789.18 కోట్లతో బడ్జెట్‌ను మంగళవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా కోవిడ్‌ –19 వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మన ముఖ్యమంత్రి సమర్థవంతమైన నాయకత్వం వల్ల మన ప్రభుత్వం ఈ పోరాటంలో ముందుందన్నారు. మంత్రి బుగ్గన ఇంకా ఏమన్నారంటే..

వికేంద్రీకరణతో ప్రజల గడప వద్దకే సేవలు
► ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చాం. కోవిడ్‌ –19 లాంటి సంక్షోభ సమయంలోనూ ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే 99 శాతం మంది అవ్వాతాతలకు పింఛన్లు అందజేశాం. 
► గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజల గడపకు చేరాయనడానికి ఇది నిదర్శనం. కోవిడ్‌ –19 సమయంలో ముందు వరసలో నిలబడి నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్‌  సిబ్బందికి ధన్యవాదాలు.
► రైతులు, కౌలుదార్లు, తల్లులు, యువత, బడుగు వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడానికి  ప్రభుత్వం కృషి చేస్తోంది.
► 2019 జూన్‌లో అధికారం చేపట్టే నాటికి అనేక సమస్యలు, అవరోధాలు, పెను సవాళ్లు మనముందున్నాయి. గత ప్రభుత్వం వదిలివెళ్లిన బకాయిలు రూ.60 వేల కోట్ల మేరకు పెండింగు బిల్లుల రూపంలో సునామీలా వచ్చిపడుతూనే ఉన్నాయి.
► 2019–20, 2020– 21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020 – 21లో డివిజినల్‌ పూల్‌లో తగ్గిన వాటా, లాక్‌డౌన్‌తో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి.
► ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని దృఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట వేసింది. రైతు భరోసాతో అన్నదాతల అభివృద్ధికి బాటలు వేశాం.
► రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన,  జగనన్న గోరుముద్ద లాంటి అద్భుత పథకాలు ప్రవేశ పెట్టాం. అందరికీ దృష్టి సమస్యలు తొలగించేందుకు ‘కంటి వెలుగు’ కార్యక్రమం చేపట్టాం. అన్నంపెట్టే రైతన్న ఆకలితో అలమటించకూడదనేది మా లక్ష్యం. అందుకే మాది రైతుల ప్రభుత్వం.

పేదల్లో చిరునవ్వుల కోసమే ‘నవరత్నాలు’
► కష్టాల్లో ఉన్న బడుగు, బలహీన వర్గాలకు కొత్త వెలుగు ప్రసాదించనప్పుడు అభివృద్ధికి అర్థమే ఉండదనే ఉద్దేశంతోనే నవరత్నాలను మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తున్నాం.
► గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అనేవి వికేంద్రీకరణ పథంలో మేం వేసిన గొప్ప ముందడుగు. వీటి ద్వారా 1.20 లక్షల మందికిపైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. 2.5 లక్షల మందిని వలంటీర్లుగా నియమించాం. 
► ఒకే సంవత్సరంలో రూ.8,000 కోట్లతో 30 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చేందుకు ప్రణాళిక వేశాం. ఇలాంటి చరిత్ర  ప్రపంచంలోనే లేదు. 2020–21లో 6.25 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదిస్తున్నాం. 
► మహిళా సంక్షేమం, మహిళలకు రక్షణ మా ప్రభుత్వ ధ్యేయాలు. ‘దిశ’ చట్టం, దీని కింద తీసుకున్న చర్యలే ప్రత్యక్ష నిదర్శనాలు.
► ప్రతి కుటుంబానికి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
► వైఎస్సార్‌ పింఛన్లు, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, కాపునేస్తం లాంటి సంక్షేమ పథకాలన్నీ అన్ని వర్గాల  సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనాలు.
► 2020–21లో గ్రామీణాభివృద్ధికి రూ.16,710.38 కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో రికార్డు. 

తగినంత సాగునీరే లక్ష్యం
► రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తగినంత సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవధార లాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ ఆ ప్రాంతానికి వరం. జగజ్జీవన్‌ రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార – నాగావళి అనుసంధానం ద్వారా ప్రభుత్వం ఉత్తరాంధ్ర రైతులకు బాసటగా నిలుస్తోంది. 
► ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టుమెంట్‌ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం.
► విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో భోగాపురం వద్ద అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమీక్షించి 500 ఎకరాలను రాష్ట్రం కోసం ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టగా, ఈ ప్రభుత్వం గాడిన పెడుతోంది. 5 కోట్ల మందితో కూడిన రాష్ట్రమనే కుటుంబ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది.

మరిన్ని వార్తలు