ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోండి

3 Mar, 2020 04:27 IST|Sakshi

15వ ఆర్థిక సంఘం చైర్మన్‌తో బుగ్గన భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి నిధులు దక్కేలా తగిన రీతిలో సిఫార్సులు చేయాలని ఆర్థిక సంఘం చైర్మన్‌ను కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తించేలా ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి పంచే వాటాలను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నిర్ణయించినందున ఆంధ్రప్రదేశ్‌పై ఇప్పటికే ప్రభావం పడిందని బుగ్గన గుర్తు చేశారు. ఆయన వెంట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ ఉన్నారు. 

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌తో.. 
నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌తో బుగ్గన రాజేంద్రనాథ్‌ సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులను ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, సముచిత రీతిలో సిఫార్సులు చేయడం ద్వారా రాష్ట్రానికి మేలు చేయాలని కోరారు. అలాగే నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి ఎకనామిక్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ మెంబర్‌ సెక్రెటరీ రతన్‌ వటల్‌తో రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ఆర్థిక అంశాలపై నివేదించారు.   

>
మరిన్ని వార్తలు