రాష్ట్రానికి బకాయిలు విడుదల చేయండి

11 Jul, 2020 05:25 IST|Sakshi
నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం ఇస్తున్న బుగ్గన

కేంద్ర మంత్రులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన

నీతి ఆయోగ్‌ సీఈవోతోనూ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని, కోవిడ్‌ మహమ్మారి ప్రభావం కారణంగా రాష్ట్రంపై ఒత్తిడి పెరిగినందున అదనంగా సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవహారాలు, ప్లానింగ్, శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌లతో శుక్రవారం ఇక్కడ సమావేశమయ్యారు. 

బకాయిలు, అదనపు సాయం కోసం..
► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,597.27 కోట్లను విడుదల చేయాలని కోరారు. అలాగే, రూ.3,832.89 కోట్లు జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు రూ.700 కోట్ల నిధులు, రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.18,830 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు.
► మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై, పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో చర్చించినట్లు బుగ్గన తెలిపారు.
► రూ.3 వేల కోట్ల మేర జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, అలాగే సీఎం జగన్‌ ప్రతి ఒక్క అంశం మీద చేసిన విన్నపాన్ని కేంద్ర మంత్రికి తెలియజేసి  బకాయిలు విడుదల చేయాలని కోరామన్నారు.
► జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో çసమావేశమైన బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన రూ.3,805 కోట్ల మేర నిధులు రీయింబర్స్‌ చేయాలని కోరారు. ప్రాజెక్టులో జాప్యం లేకుండా త్వరగా నిధులు ఇచ్చేందుకు వీలుగా రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఖర్చును రీయింబర్స్‌ చేయాలని కోరారు. 

కిషన్‌రెడ్డితో భేటీ: రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయం అందేలా చూడాలని, పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనలు అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని బుగ్గన కోరారు. 
► అలాగే, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌తో చర్చించారు. అనంతరం ఆయన నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌తో భేటీ అయి రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరుకు సిఫారసు చేయాల్సిందిగా కోరినట్టు తెలిపారు. 
► ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, జల వనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా