ఆర్ధికంగా ఆదుకోండి

12 Nov, 2019 03:51 IST|Sakshi
ఢిల్లీలో కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన మంత్రి బుగ్గన 

రెవెన్యూ లోటు, ఇతర నిధులు విడుదల చేయండి 

టీడీపీ పాలనలో ఏపీకి గుదిబండలా అప్పులు 

కొత్త ప్రభుత్వంపై రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లుల భారం మోపింది   

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమస్యలతోపాటు గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సాయం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె కార్యాలయంలో కలిసిన బుగ్గన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కూడా ఆయన వెంట ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రెవెన్యూ లోటు, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాల్సి ఉందని ఈ సందర్భంగా బుగ్గన నివేదించారు.

టీడీపీ పాలనలో రాష్ట్రం మరింత వెనుకబాటుకు గురైందని, అప్పులు పెరిగిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న అప్పులను 2021 నుంచి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేంద్రమంత్రికి వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చేయాల్సిన అప్పులను కూడా గత సర్కారే తీసుకోవడమే కాకుండా రూ. 40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు మిగిల్చి దిగిపోయిందన్నారు. ఈ క్రమంలో కొత్తగా అప్పులు తీసుకొనే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇతర రాష్ట్రాల కంటే అధికంగా ఆర్థిక సాయం చేసి చేయిపట్టుకొని నడిపించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్టు సమావేశం అనంతరం బుగ్గన మీడియాకు తెలిపారు. 

వ్యవస్థలో మార్పు తేవడమే లక్ష్యం..
ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్య పథకాలు ఉంటాయని బుగ్గన పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, వృద్ధాప్య పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు బీమా, వాహనమిత్ర పథకాలను ప్రాధాన్యం కలిగినవిగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలన్నింటిలో బయటకు కనిపించే సాయం ఒకటైతే అంతర్గతంగా దీర్ఘకాలంలో వ్యవస్థలో మార్పులు తేవడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

వాహనమిత్ర ద్వారా అందించే సాయంతో లబ్ధిదారులు పక్కాగా బీమా, ట్యాక్స్‌లు చెల్లించడం ద్వారా వారిలో బాధ్యత పెంచాలన్నది ఉద్దేశమన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించిన తరువాత స్కూళ్లలో విద్యార్థుల చేరిక సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రైతు బీమా పథకం కింద గతంలో 10 శాతం మాత్రమే బీమా చెల్లించేవారని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుండడంతో 100 శాతం బీమా నమోదవుతోందన్నారు. దీనివల్ల బీమాపై అవగాహన పెరిగి వైద్య సేవల బీమా, వాహనాల బీమా చేయించుకొనేలా దోహదం చేస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికుల మృతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా