‘ఛైర్మన్‌పై టీడీపీ సభ్యులు ఒత్తిడి తెచ్చారు’

22 Jan, 2020 21:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపడాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్‌ డే కంటే ఘోరమైన రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. బిల్లులను ఓటింగ్‌కు పెట్టకుండా.. టీడీపీ సభ్యులు ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే ముందుగానే మోషన్‌ మూవ్‌ చేయాలని, కానీ ఛైర్మన్‌ అలా చేయకుండా డైరెక్ట్‌గా సెలెక్ట్‌ కమిటీకి పంపారన్నారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఛైర్మన్‌ వ్యవహరించారని ఆరోపించారు. నిబంధన ప్రకారం సెలక్ట్‌ కమిటీకి పంపొద్దని చెబుతూనే విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం సిగ్గు చేటన్నారు. అందరికీ నీతి నియమాలు చెప్పే యనమల రామకృష్ణుడు.. వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనలు పాటించలేదన్నారు. మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోకాలొడ్డిందని విమర్శించారు. 

బిల్లులను అడ్డుకొని చంద్రబాబు ఏం సాధించారు?
విచక్షణాధికారంతో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించానని ఛైర్మన్‌ ప్రకటించడం దారుణమని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీకి ఈ రోజు బ్లాక్‌ డే అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండు బిల్లులను శాసన సభలో ఆమోదించుకొని మండలికి వస్తే.. చర్చ జరపకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఛైర్మన్‌ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు సిగ్గులేకపోతే.. ఛైర్మన్‌ అయినా ఆలోచించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు. చంద్రబాబుకు తన స్వార్థం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదన్నారు. ఈ బిల్లులను అడ్డుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు, ఛైర్మన్‌ షరీఫ్‌ చరిత్రహీనులుగా మిగిలిపోతారని మంత్రి బొత్స పేర్కొన్నారు.
 


చదవండి: సెలెక్ట్‌ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

మరిన్ని వార్తలు