నిర్మలా సీతారామన్‌ సానుకూలంగా స్పందించారు : బుగ్గన

3 Mar, 2020 17:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుగ్గన మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. బుగ్గనతోపాటు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, బల్లి దుర్గప్రసాద్‌, వంగా గీత, బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ పేరుతో గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి.. ఆ డబ్బులను ఇతర పనులకు వినియోగించిందని విమర్శించారు. దీంతో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు మార్కెట్‌ నుంచి డబ్బులు సమకూరే పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ధాన్యం సేకరణ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కేంద్రానికి వివరించినట్టు వెల్లడించారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర పరిస్థితిని పరిగణలోకి తీసుకునే అంశంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని.. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి సడలించాలని కోరాను. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతోందని మంత్రికి వివరించాను. రెవెన్యూ లోటు గ్రాంట్ ఇవ్వాలని కోరాను. వెనకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడంతోపాటు.. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు నిధులు ఇవ్వాలని కోరాను. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. ఏదో ఒకరోజు ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. 

రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో  కేంద్రం నుంచి గ్రాంట్లు  ఇవ్వాలని కోరాను.  2011 జనాభా లెక్కలు, రాష్ట్ర విభజన, గత ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యం నేపథ్యంలో ఏర్పడిన  పరిస్థితులను  15వ ఆర్థిక సంఘం చైర్మన్ కు వివరించాను. జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలను శిక్షించ వద్దని కోరాను. టీడీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేయడం వల్ల బయట నుంచి రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి ఉంది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధుల లేమి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇవ్వాలని కోరాను. ఉద్దానం కిడ్నీ బాధితులకు , గోదావరి, ప్రకాశం,  కడప జిల్లాల యురేనియం ప్రాంతాలకు  వాటర్ ఇవ్వాల్సిన నేపథ్యంలో వీటికి నిధులు ఇవ్వాలని కోరాను. కరువుతో అల్లాడుతున్న రాయలసీమను ఆదుకునేందుకు కెనాల్ క్యాటరింగ్  కెపాసిటీ పెంచేందుకు నిధులు ఇవ్వాలని కోరాను.  ఉత్తరాంధ్ర రాయలసీమ లో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంద’ని తెలిపారు.(చదవండి : ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోండి)

మరిన్ని వార్తలు