‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు’

9 Sep, 2019 22:23 IST|Sakshi

సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు అమలుచేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. 2034 నాటికి 850 బిలియన్‌ అమెరికా డాలర్ల ఆర్థికశక్తిగా రాష్ట్రం ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దీనికోసం సత్వర ఆర్థిక అభివృద్ధి, భవిష్యత్తు మానవవనరులను సిద్ధంచేయడానికి మానభివృద్ధి రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం, బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక భద్రత కల్పించడం, పరిపాలనలో పారదర్శకతను సాధించడం, ఈ నాలుగు అంశాల ప్రాతిపదికగా సమగ్రాభివృద్ధి వ్యూహాన్ని అమలుచేస్తున్నామని బుగ్గన విశదీకరించారు. సింగపూర్‌లో నిర్వహించిన ‘‘ఇండియా సింగపూర్‌ – ది నెక్ట్స్‌ ఫేజ్‌ సదస్సు’’లో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ ప్రసంగించారు. 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పయనంలో సింగపూర్‌ కీలక భాగస్వామి అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ అన్నారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సమగ్రాభివృద్ధికోసం అన్ని చర్యలూ తీసుకుంటోందని వివరించారు. తమ నాయకుడు 3,648 కిలోమీటర్ల మేర, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో చేసిన సుదీర్ఘయాత్రలో ప్రజలనుంచి విన్న అనేక సమస్యలు, స్వీకరించిన అనేక విజ్ఞప్తుల ప్రాతిపదికగా విజన్‌ను రూపొందించుకున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో 2035 నాటికి పట్టణజనాభా 35శాతం నుంచి శాతానికి పెరుగుతుందని తాము అంచనావేస్తున్నట్టు, ఆమేరకు ప్రజల అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని వెల్లడించారు. 86శాతం సీట్లు సాధించి అధికారంలోకి రావడంద్వారా రాజకీయ బలమైన రాజకీయ స్థిరత్వాన్ని సాధించామని, స్థిరమైన అభివృద్ధి ప్రణాళికలను కొనసాగించడానికి ఇదిచాలా దోహదపడుతుందని బుగ్గన చెప్పారు. 2034 నాటికి 850 బిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఇప్పుడున్న అవకాశాలతో రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. పారశ్రామిక విప్లవానికి అవసరమైన నైపుణ్యమున్న మానవనరులను తయారుచేస్తున్నామన్నారు. 

విద్య, ఆరోగ్యం, సంరక్షణ, పౌష్టికాహారం, మహిళా సంక్షేమం, యువకులకు, విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వటంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో 30శాతం జీఎస్‌డీపీ వ్యవసాయ అనుబంధరంగాలదేనని, ఇందులో పెట్టుబడులకు అపారఅవకాశాలున్నాయని బుగ్గన చెప్పారు. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, ఆక్వాకల్చర్, పశుసంవర్థక రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2030 నాటికి మౌళిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగం, పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రతిఏటా 300 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేయాల్సి వస్తుందని బుగ్గన వివరించారు. 

వైజాగ్‌ – చెన్నై, చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో పెట్టుబడుల ద్వారా ఆ జోన్లను మరింత బలోపేతం చేస్తున్నామని ఆర్థిక మంత్రి వివరించారు. కనెక్టివిటీని మరింత పెంచడానికి గ్రీన్‌ఫీల్డ్‌ఎయిర్‌ పోర్టును బలోపేతం చేయడమే కాకుండా, మరో రెండు ఎయిర్‌ పోర్టులను కూడా అభివృద్దిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నవరత్నాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలసహా, అవినీతి రహిత రాష్ట్రంకోసం ఇటీవల తీసుకుంటున్న చర్యలను బుగ్గను వివరించారు. గ్రామ సచివాలయాల ద్వారా అధికార వికేంద్రీకరణ, ప్రజల ముందుకు ప్రభుత్వ సర్వీసులను తీసుకొస్తున్నామని చెప్పారు. పరస్పర ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రగతి బాటలో కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు.

మరిన్ని వార్తలు