అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం

12 Aug, 2019 08:04 IST|Sakshi
 ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి   

సాక్షి, డోన్‌ : అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం డోన్‌ పట్టణంలోని జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి నవరత్న పథకాల్లో కొన్నింటిని అమలు చేస్తామన్నారు. అమ్మఒడి, రైతులకు పంట పెట్టుబడి, చౌక ధరలకు ఇసుక, కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దళారులతో ప్రమేయం లేకుండా వైఎస్సార్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు నవరత్న పథకాలన్నీ క్రమపద్ధతిలో అమలు చేస్తామాన్నరు. ప్రజాధనానికి ప్రభుత్వంలోని పాలకులు జవాబుదారీతనంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారన్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో పెద్దలు పాల్పడిన అవినీతి, అక్రమాల మూలంగా పరిపాలన వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో సంస్కరణల అమలును వేగవంతం చేసి అధికారుల పనితీరును మెరుగుపరుస్తామని మంత్రి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు చేరుస్తామన్నారు. ఈ పథకాల అమలులో దళారీలు, అవినీతిపరుల పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు.  పరిపాలనలో పారద్శకత ఉండేటట్లు చూడడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.  

ఉద్యోగాల విప్లవం 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా సచివాలయాల్లో పనిచేసేందుకు 4 లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని స్పష్టం చేశారు.  ప్రసక్తే లేదని మంత్రి బుగ్గన స్పష్టంచేశారు. డోన్, ప్యాపిలి మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్‌ చక్రవర్తి, పార్టీ నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్, చిన్న కేశవయ్య గౌడ్, లక్ష్మీరెడ్డి, ఇబ్రహీం, సోమశేఖర్‌ రెడ్డి, మర్రి గోవిందరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు