‘ఎవరూ చేయని పని ఎందుకు చేశారు చంద్రబాబూ’

16 Nov, 2018 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీబీఐ పేరు చెబితేనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలో, సీబీఐ కేంద్ర పరిధిలో ఉంటుందన్నారు. ప్రతి వ్యవస్థకు ఓ బాధ్యత ఉంది. కేంద్ర వ్యవస్థలకు, రాష్ట్ర వ్యవస్థలకు వాటి వాటి బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర పరిధిలో 97 అంశాలు రాష్ట్ర పరిధిలో 67 అంశాలు ఉమ్మడిజాబితాలో 46 అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగ్ ను, సెంట్రల్ విజిలెన్స్ కమీషన్‌ను కూడా అలాగే ఏర్పాటు చేశారు. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ధ్వజమెత్తారు.

'మీరు కరెక్ట్ గా ఉన్నపుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు. ఇటీవల ఐటీ వాళ్లు మీ టీడీపీ వారిపై దాడులు చేస్తే అల్లరి అల్లరి చేశారు. ఏ రాజకీయపార్టీకి చెందిన వారైనా వ్యాపారులైతే చెక్ చేయకూడదనేది మీ భావనగా ఉంది. రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం సంఘటనను కేంద్ర ఏజెన్సీ దర్యాప్తుకి అప్పగిస్తారని భయపడుతున్నారా. మీరు చేసిన ఈ పని చాలా దురదృష్టకరమైన అంశం. జగన్‌పై దాడి వంటి సంఘటన జరిగితే ఎవరైనా సరే సరైన విచారణ జరిపిస్తాం అని చెబుతారు. కానీ, సంఘటన జరగగానే డీజీపీ పక్షపాతంతో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైఎస్‌ జగన్ థర్డ్ పార్టీ విచారణ అడిగారు. కోడికత్తి అంటూ చంద్రబాబు వెకిలిగా మాట్లాడారు. హత్యాయత్నం జరిగిందా లేదా అని చూడాలి గానీ ఇలా ఎవరైనా మాట్లాడతారా? ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తుంటే చిన్న కత్తెర కూడా అనుమతించరు. ఇంత అనుభవం, బాధ్యత పెట్టుకుని ఇలా చేస్తారా?

జరగబోయే పరిణామాలకు భయపడి ఇలాంటి జీఓలు తెస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. తక్షణమే ఈ జీఓను ఉపసంహరించండి. అన్ని రకాలుగా చట్టం తనపని తాను చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. కొన్ని సందర్బాలలో కేంద్రం, మరికొన్ని సందర్భాలలో కోర్టులు సీబీఐ విచారణకు ఆదేశిస్తాయి. ఆర్మీ, నేవి వంటివి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వచ్చి జోక్యం చేసుకుంటాయి. ఫెడరల్ సిస్టమ్ లో వీటిని పకడ్బందిగా ఏర్పాటు చేశారు. ఆర్మ్స్ యాక్ట్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ప్రేలుడు పదార్థాలు, బంగారం, మైన్స్, ఖనిజాలు, మోటారు వెహికల్స్, ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, పోస్ట్ ఆఫీస్ యాక్ట్, మనీల్యాండరింగ్‌ యాక్ట్, రైల్వేస్ యాక్ట్‌లను భారత పౌరుల రక్షణకోసం ఏర్పాటుచేశారు. వీటన్నింటినీ మీ ఉత్తర్వుల ద్వారా ఏం చేయబోతున్నారు. కేంద్ర వ్యవస్థలలో పరిశోధన చేసేందుకు దానిని ఏసీబీ చేసేలా ప్రస్తుతం జారీ చేసిన జీఓ వీలుకల్పిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని పని ఎందుకు చేశారు చంద్రబాబూ' అని బుగ్గన నిప్పులు చెరిగారు. 

'సీబీఐ ఏపీలో నేరపరిశోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ద్వారా అనుమతి నిరాకరిస్తోందని తెలిపారు. ఎఫ్ఆర్‌బీఎం చట్టంను కేంద్రం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు అధికంగా అప్పులు చేయడాన్ని నిరోధిస్తూ ఈ చట్టం తెచ్చారు. దానిని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులుగా చేశారు. ఇది పదవ షెడ్యుల్ ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఇది అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ప్రశ్నించింది. గోదావరి పుష్కరాలలో 30 మంది చనిపోతే కనీసం ఏ అధికారిపైన అయినా చర్యలు తీసుకున్నారా. ముఖ్యమంత్రి పుష్కరాలలో సాధారణ భక్తుల మధ్యకు డాక్యుమెంటరీ తీయడానికి వెళ్లి దుర్ఘటనకు కారకులయ్యారు' అని బుగ్గన మండిపడ్డారు.

చదవండి : ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ

మరిన్ని వార్తలు