కదం తొక్కిన  భవన కార్మికులు

11 Jul, 2018 11:05 IST|Sakshi
కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సంఘ అధ్యక్షుడు రమణ

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మిక సంఘ కార్మికులు మంగళవారం కదం తొక్కారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం అక్కయ్యపాలెంలోని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పడాల రమణ పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. చట్టం ద్వారా బోర్డుకు వస్తున్న నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. అంతేకాకుండా సర్కారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. కార్మికులకు ఉపయోగం లేని కిట్లు కొనుగోలు, శిక్షణ శిబిరాల పేరుతో కోట్లాది రూపాయలు అధికారుల జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు.

ఇతర రాష్ట్రాలలో సంక్షేమ బోర్డు పథకాల అమలను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలించి మన రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 55 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులు మరణించాక బోర్డు ద్వారా నెలకు రూ.3వేలు పింఛనుమంజూరు చేయాలని కోరారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు కోట సత్తిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ అధ్యక్షులు కూన కృష్ణారావు, వర్కింగ్‌ అ«ధ్యక్షుడు కోన లక్ష్మణ, నాయకులు సూర్యనారాయణ, ప్రతాప్, పొన్నాడ సాయి, నాగేశ్వరరావు, తిరుమలరావు, సూరిబాబు, వెంకటకుమార్, రమణీశ్వరి పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు