ఆన్‌లైన్‌లో భవన నిర్మాణాల అనుమతులు

5 Sep, 2015 03:13 IST|Sakshi
ఆన్‌లైన్‌లో భవన నిర్మాణాల అనుమతులు

- నవంబర్ 1 నుంచి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో అమలు
- సాఫ్‌టెక్ సొల్యూషన్స్‌కు రూ. 26.06 కోట్లకు టెండర్  ఖరారు
- రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో అమలుకు నిర్ణయం
- విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీటీసీపీ రఘురామ్
సాక్షి, గుంటూరు:
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా త్వరలో ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణాల అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ (డీటీసీపీ) జి.వి.రఘురామ్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రత్యేకాధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటి వద్ద నుంచి భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే ఆన్‌లైన్‌లో అనుమతులు పొందే ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాఫ్‌టెక్ సొల్యూషన్స్‌కు రూ.26.06 కోట్లకు టెండర్‌ను ఖరారు చేశామని చెప్పారు.

ముందుగా పెలైట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థల్లో నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎంసీలో ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 83 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అందులో 54 దరఖాస్తు దారుల వద్దే పెండింగ్ ఉన్నాయని వివరించారు.

ఈ ఒక్క రోజులో 11 దరఖాస్తులు పూర్తి చేసి అనుమతులు ఇచ్చామని తెలిపారు. 200 చదరపు గజాల కంటే లోపు ఉన్న వారు దరఖాస్తుతోపాటు డబ్బు మొత్తం కట్టేస్తే రెండు లేదా మూడు రోజుల్లో అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అనుమతుల మంజూరులో ఆలస్యం చేసిన ఓ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌కు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వేశామని చెప్పారు. టీడీఆర్ బాండ్‌లకు కామన్ రిజిస్టర్ లేదని గుర్తించామని, దీని వల్ల ఇప్పటికి ఎన్ని తప్పులు జరిగాయనేది అటుంచితే భవిష్యత్తులో తప్పులు జరిగే ప్రమాదం ఉందని డీటీసీపీ అన్నారు. రోడ్డు, కాలువలు ఏర్పాటు చేయకపోతే అపార్ట్ మెంట్‌లకు అనుమతిచ్చే సమస్యే లేదు. ఖచ్చితంగా బీటీ రోడ్ ఏర్పాటు చేయాలి. బీపీఎస్‌ను అందరూ వినియోగించుకోవాలని డీటీసీపీ రఘురామ్ కోరారు.

మరిన్ని వార్తలు