అద్దె మోత

7 Jul, 2018 12:43 IST|Sakshi
అద్దె భవనంలో కొనసాగుతున్న నెల్లూరు అర్బన్‌ సీడీపీఓ కార్యాలయం

ఐసీడీఎస్‌ను వెంటాడుతున్న భవనాల కొరత

దీర్ఘకాలంగా అద్దె గృహాల్లోనే..

అసంపూర్తిగా నిర్మాణాలు

ప్రతిపాదనలకు పరిమితమవుతున్న స్థల సేకరణ

లక్షల్లో అద్దె బకాయిలు

మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. నిధుల విడుదల ఎలా ఉన్నప్పటికీ పాలకులకు, ఆ శాఖ అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఐసీడీఎస్‌ను భవనాల కొరత వెంటాడుతోంది. ఏళ్ల తరబడి అంగన్‌వాడీ కేంద్రాలు, సీడీపీఓల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు ఆ శాఖ ద్వారా అద్దెలకు కేటాయించడం పరిపాటిగా మారుతోంది.

నెల్లూరు(వేదాయపాళెం): ఐసీడీఎస్‌ భవనాల కోసం స్థలసేకరణ విషయంలో ప్రతిపాదనలకు, హామీలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మంజూరైన అరకొర భవనాల నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో అవి అసంపూర్తిగా ఉంటున్నాయి. జిల్లాలోని 17 ప్రాజెక్టుల్లో 3454 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు, 320 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో 3 ఏళ్ల లోపు చిన్నారులు 89,856 మంది, 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 82,736 మంది ఉన్నారు. వీరికి పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టికాహారం అందించాల్సిఉంది. వీరితోపాటు గర్భిణులు 18,943 మంది, బాలింతలు 17,786 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు 1311 సొంత భవనాలు ఉండగా 1272 కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అర్బన్‌ ప్రాంతాల్లో అధికంగా అద్దె భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ జరుగుతోంది. నెల్లూరు అర్బన్‌ ప్రాజెక్టులో పూర్తిగా అద్దె భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. అర్బన్‌ ప్రాంతాల్లో ఒక్కో కేంద్రానికి రూ.3 వేలు, రూరల్‌ ప్రాంతాల్లో రూ.700 అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సీడీపీఓ కార్యాలయాలకు రూ.6600 చొప్పున చిల్లిస్తున్నారు.

నెలల తరబడి అద్దె బకాయిలు
జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు నెలల తరబడి అద్దె బకాయిలు పెరిగిపోతుండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ముఖ్యంగా అర్బన్‌ ప్రాంతాల్లో భవనాల యాజమానులు అద్దె చెల్లింపుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తుండడంతో కార్యకర్తలు అప్పులు చేసి మరీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల కేంద్రాలను ఖాళీ చేయాల్సిందిగా యాజమానుల నుంచి కార్యకర్తలకు ఒత్తిళ్లు కూడా ఎదురవుతున్నాయి.

అసంపూర్తి పరంపర
2017వ సంవత్సరానికి ముందు నాబార్డు నిధులతో 102 భవనాలు మంజూరు కాగా అందులో 31 భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 2017–18కి గాను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం భవనానికి రూ.7.50 లక్షల అంచనా వ్యయంతో 371 భవనాలు మంజూరయ్యాయి. 188 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, హౌసింగ్‌ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 2016–17 ఏడాదికి గానూ సీడీపీఓల కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమశాఖ నిధులతో ఒక్కో భవనానికి రూ.53 లక్షల అంచనా వ్యయంతో పనులను చేపట్టారు. రెండేళ్ల నుంచి కొన్ని భవనాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. నెల్లూరుఅర్బన్, నాయుడుపేట, పొదలకూరు, బుచ్చి, ఆత్మకూరు, వింజమూరు, సీడీపీఓల కార్యాలయాల భవనాలు పూర్తి దశకు చేరుకోలేకున్నాయి.

నెరవేరని మంత్రి హమీ
అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలకు దీటుగా చేస్తామని చెబుతున్న మంత్రి నారాయణ హామీ నెరవేరలేదు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనాలు నిర్మించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ముందుకు సాగడం లేదు. కనీసం స్థల సేకరణ జరిపిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.   

కార్యకర్తలకు ఆర్థిక ఇబ్బందులు
అద్దెల చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. గృహాల యాజమానుల ఒత్తిళ్లను భరించాల్సివస్తోంది. శాశ్వత భవనాల నిర్మాణాల విషయంలో ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. పాలకులు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.
– షేక్‌ మస్తాన్‌బీ, నెల్లూరు అర్బన్‌ ప్రాజెక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కార్యదర్శి 

మరిన్ని వార్తలు