ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్‌

16 Jul, 2019 11:11 IST|Sakshi
ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు 

సాక్షి, కాకినాడ సిటీ: టీడీపీ ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలు వర్గాల సోమవారం ఆందోళనలు చేయడంతో కాకినాడ కలెక్టరేట్‌ దద్దరిల్లింది. ఆందోళన చేసిన వారు కలెక్టరేట్‌లో వినతిపత్రాలు అందజేశారు. ఇసుక మాఫియాను అరికట్టి, ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దాపురం డివిజన్‌లో నీరు–చెట్టు పథకం పనులు కొందరు తీసుకున్నారని, వాటిలో తమకు అప్పగించిన 90 శాతం పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. గత టీడీపీ పాలకులు కొందరు అవకతవకలకు పాల్పడ్డారని, అప్పులు చేసి ఈ పనులు చేశామని, వారి వల్ల తమకు అన్యాయం చేయవద్దని వారు విన్నవించుకున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో తొమ్మిది నెలలకు రావాల్సిన గౌరవ వేతనాలు, పారితోషికాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అశా వర్కర్ల యూనియన్‌ ఆధ్వర్యంలోనూ, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనాన్ని ఇస్తున్న మాదిరిగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అదే వేతనాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వాలని కోరుతూ జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలోనూ, గత ఎన్నికల విధుల కోసం వాడుకున్న వాహనాలకు కిరాయిలు చెల్లించలేదంటూ ఏపీ  టాక్సీ ఓనర్లు, డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  మోటారు వాహన చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ఫోర్టు సంఘాల కార్మికులు ఆందోళన చేశారు.

ఇసుక మాఫియాను అరికట్టి.. 
ఇసుక మాఫియాను అరికట్టి, ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కొత్త పాలసీ కోసం ఇసుకను ఆపేయడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఉచితంగా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట ఇసుకను దోచుకుందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నిర్వాకంతో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్‌ ప్రభుత్వం నూతన విధానాన్ని అమలుజేసి కార్మికులకు ఉపా ధి కల్పించాలని కోరా రు. ఇసుక మాఫీయాను అరెస్ట్‌ చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్‌ మంజూరు చేయాలని కార్మికులు నినాదాలు చేశారు. తొలుత బాలాజీ చెరువు సెంటర్‌ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ నారాయణ, టి.అన్నవరం, భానుప్రకాష్, నారాయణమూర్తి, పి.సత్యనారాయణ, జి.లోవరత్నం, సాయిబాబు, పెంటకోట సత్తిబాబు, శివకోటి రాజు వీవేణి, చిట్టిబాబు పాల్గొన్నారు. 

ఎన్నికల కిరాయి చెల్లింపు కోసం 
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఉపయోగించుకున్న మోటారు రవాణా వాహనాలకు కిరాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ టాక్సీ ఓనర్లు, డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికలు పూర్తయి నాలుగు నెలలైనా కిరాయిలను చెల్లించలేదన్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని, వాహనదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ కష్టార్జితాన్ని తక్షణం చెల్లించాలని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవస్థలు పడుతున్న మోటారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

నాలుగు చక్రాల వాహనాన్ని కార్మికుల వృత్తి సాధనంగా భావించాలని, వీరికి తెల్ల రేషన్‌కార్డును రద్దు చేస్తామని చెబుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం వాస్తవిక దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముచ్చకర్ల సత్యనారాయణ, కర్రి విష్ణురెడ్డి, నామా ప్రసాద్, కొక్కిరిమెట్ల దుర్గారావు, పి.చిన్నయ్య, కె. భాస్కరరావు, బి.విజయ, ఎన్‌.వెంకటేశ్వరరావు, కె.రాంబాబు, బొర్రా గణేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు