సర్వం ధ్వంసం

30 Jun, 2014 01:55 IST|Sakshi
సర్వం ధ్వంసం

పూరిపాకలే దెబ్బతిన్నాయన్న చంద్రబాబు ప్రకటనపై బాధితుల ఆగ్రహం
పక్కా ఇళ్లకు పరిహారంపై ప్రకటన చేయని ప్రభుత్వం

 
అమలాపురం: ఏదైనా భారీ ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని నష్టంపై ఒక నిర్ణయానికి వస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే రెవెన్యూ, ఇతర విభాగాల సిబ్బంది ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. నష్టాన్ని అంచనా వేస్తారు. అయితే, తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైపు లైను పేలిన ఘటనలో ఇళ్లకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ ప్రమాదంలో 20 మంది మృత్యువాతపడ్డారు.

పంటలు, కొబ్బరి తోటలు, జంతువులు, పక్షులకు తీవ్ర నష్టం జరిగింది. నివాస గృహాలకూ భారీ నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన రోజున సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూరిపాకలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు. దీంతో దెబ్బతిన్న పక్కా భవనాలకు పరిహారం ఇవ్వరేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నా రు.

ఈ ప్రమాదంలో పూరిపాకలే కాదు.. పక్కా భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు తీవ్రతకు గోడలు బీటలు వారాయి. ఫ్లోరింగ్ ధ్వంసమైంది. గుమ్మాలు, తలుపులు మాడి మసైపోయాయి. ప్రమాదంలో మొత్తం 12 ఇళ్లు దగ్ధమవగా, వీటిలో ఆరు పక్కా భవనాలు, ఒక పెంకుటిల్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, నాలుగు పూరిళ్లు ఉన్నాయి. పెంకుటింట్లో నివాసముంటున్న సత్యనారాయణ, జ్యోత్స్నాదేవి, ఏడాది బాలిక, అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆర్.సూర్యనారాయణ, బాలాజీ, దివ్యతేజ, మరో బాలిక మృత్యువాత పడ్డారు.

పక్కా భవనాల్లో నివసిస్తున్నవారిలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ భవనాలకు ఎంత నష్టం జరిగి ఉంటే ఇంతమంది మరణించి ఉంటారన్న విషయాన్ని సర్కారు పట్టించుకోలేదు. బీటలు వారిన ఇళ్లు ఎంతోకాలం ఉండవని, ఉన్నా అవి నివాసయోగ్యం కాదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం పక్కా భవనాలకు నష్ట పరిహారంపై ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

మరిన్ని వార్తలు