తీరం దాటిన బుల్‌బుల్‌

10 Nov, 2019 04:11 IST|Sakshi
బుల్‌బుల్‌ తుపాను శాటిలైట్‌ చిత్రం

ఉత్తర ఒడిశా,పశ్చిమబెంగాల్‌పై తీవ్ర ప్రభావం

సహాయక చర్యలతో సిద్ధమైన నౌకాదళం

సాక్షి, విశాఖపట్నం : వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతితీవ్ర తుపాను బుల్‌బుల్‌ క్రమంగా బలహీన పడనుంది. ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి శనివారం సాయంత్రం వాయువ్య బంగాళాఖాతం వద్ద పారాదీప్‌కు తూర్పు ఈశాన్య దిశగా 175 కి.మీ., పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ దిశగా 50 కి.మీ., కోల్‌కతాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా బలహీనపడుతూ తీవ్ర తుపానుగా మారింది. అనంతరం ఈశాన్య దిశగా ప్రయాణించి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల మధ్య శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్‌ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.

రాష్ట్రంలోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుల్‌బుల్‌ తీరం దాటినప్పటికీ.. సముద్రంలో అలజడి ఉండటంతో ఆదివారం కూడా మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్ల వద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బుల్‌ బుల్‌ ప్రభావం ఎక్కువగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాలపై ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. 

సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం..
బుల్‌బుల్‌ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలకు అప్రమత్తంగా ఉన్నట్లు తూర్పు నౌకాదళం ప్రకటించింది. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో సహాయక సామగ్రితో మూడు నౌకల్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు పయనమయ్యేందుకు ఐఎన్‌ఎస్‌ డేగా నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో గజ ఈతగాళ్లు, జెమినీ బోట్లు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎయర్‌క్రాఫ్ట్‌ల ద్వారా నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్‌ సర్వే నిర్వహించి.. తీవ్రతను గమనించి ఆయా ప్రాంతాలకు రిలీఫ్‌ మెటీరియల్‌ అందించనున్నామని తూర్పు నౌకాదళాధికారులు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా