గెలుపే గమ్యం..!

4 May, 2018 12:54 IST|Sakshi
పందెంలో దౌడు తీస్తున్న ఎడ్లు

పందెం ఎడ్ల రూటే సెపరేటు

పోటీలపై పెరుగుతున్న ఆసక్తి

ఏటా పెరుగుతున్న పందాలు

రూ. లక్షలు పలుకుతున్న పందెం ఎడ్లు

తూర్పుగోదావరి, పిఠాపురం : వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎడ్లు నేడు పరుగు పందాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పూర్వం నుంచి ఎడ్ల పందాలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పండుగలకు మాత్రమే పరిమిత మయ్యేవి. గతంలో ప్రత్యేక పండుగ రోజులు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నిర్వహించే ఈ పందాలు నేడు మామూలు సమయాలలోనూ కొనసాగుతున్నాయి. కేవలం పందెంలో గెలుపే లక్ష్యంగా రూ. లక్షలు వెచ్చించి మరీ ఎడ్లను పెంచడంలో పలువురు రైతుల ఆసక్తి చూపుతున్నారు.

పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని రైతులు చెబుతున్నారు. ఎడ్లు, అవి లాగే బండ్లు వ్యవసాయంలో కీలక పాత్ర పోషించినా యంత్రాలు అందుబాటులోకి రావడంతో ప్రతి రైతు ఇంటా ఉండే ఎడ్లు బళ్లు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. కానీ కొందరు రైతులు ఎడ్ల బళ్ల పోటీల కోసమే ప్రత్యేకంగా ఎడ్లను పెంచుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒకచోట ఎడ్ల పరుగు పందాలు జరుగుతుండగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పందాల కోసం రైతులు తమ ఎడ్లను తీసుకుని వస్తున్నారు. జిల్లాలో లైను పందాలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందాలు ఆడుతుంటారు.

ప్రత్యేక శిక్షణ
పరుగు పందాల్లో పాల్గొనే ఎడ్లకు గిత్తల ప్రాయం నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. కేవలం ఒక సంవత్సరం వయసులో ఉండగానే చిన్న సైజు బండ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. సాధారణ ఎడ్లలా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తూ సమయానుకూలంగా దూరాలను పరుగెత్తిస్తుంటారు.

ఎడ్ల ఖరీదు రూ.లక్షల్లో
సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందాలకు వినియోగిస్తారు. పరుగు పందాలలో పాల్గొనే ఎడ్ల ఖరీదు రూ.లక్షల్లో పలుకుతోంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకే రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చైనా రైతులు వెనుకాడడం లేదు. ఇతర జిల్లాలకు వెళ్లి మరీ రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

మేత కూడ ప్రత్యేకమైనదే
పందాల్లో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేకమైన మేత మేపుతుంటారు. కేవలం ప్రత్యేకమైన దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు,  ప్రతీరోజు ఉడకబెట్టి నానబెట్టిన ఎండుగడ్డి ముక్కలలో వేసి దాణాగా మేపుతారు. వీటి మేతకు సంవత్సరానికి సుమారు 3 లక్షల వరకు వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందాలు ఉన్నా లేకపోయినా వీటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పదని మేతలో ఎప్పుడూ మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉంటుందంటున్నారు.

ప్రత్యేక మసాజ్‌లు
పరుగెత్తి అలసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్‌ వంటి మందులతో మసాజ్‌ చేస్తుంటారు. ప్రతీ రోజు పరుగులో శిక్షణ అనంతరం మసాజ్‌ చేయకపోతే కాళ్లు పట్లు పటేసి పరుగుకు ఇబ్బందిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీనికోసం పరుగు పెట్టిన ప్రతీసారీ మసాజ్‌లు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందంటున్నారు.

పందెం కొడితే విలువ పెరుగుతుంది
పందెంలో గెలిచిన ఎడ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది. ఎన్ని పందాలు కొడితే అంత విలువ పెరగడంతో పాటు పోటీపడి మరీ ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ పందాలు కొట్టిన ఎద్దులు ఒక్కోటి సుమారు రూ.3 లక్షల నుంచి 4 లక్షలకు అమ్ముడవుతాయని రైతులు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులు పందాలు ఎక్కువగా గెలిచే ఎడ్లను కొనుగోలు చేస్తుంటారు.

మరిన్ని వార్తలు