ఎన్నికల సర్వే ముసుగులో.. బెదిరింపు బృందాలు

12 Aug, 2017 00:45 IST|Sakshi
ఎన్నికల సర్వే ముసుగులో.. బెదిరింపు బృందాలు
నంద్యాల్లో పరాకాష్టకు చేరిన సర్కారు పెద్దల నిర్వాకం
- ఇతర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
 
టీడీపీకి ఓటేస్తేనే పథకాలు.. లేదంటే కట్‌ అంటూ హెచ్చరికలు
 
నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి/సాక్షి నెట్‌వర్క్‌ : కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం, బెదిరింపుల పర్వం పరాకాష్టకు చేరుకుంది.  సర్వే పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి.. ‘టీడీపీకి ఓటేస్తేనే పథకాలు వర్తిస్తాయి. లేదంటే అన్నీ కట్‌’ అంటూ భయపెడు తున్నారు. అధికార పార్టీ దౌర్జన్యాల గురించి తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు శుక్రవారం వారిని అడ్డుకుని పోలీసులకు అప్పజెప్పారు. టీడీపీ నేతల బండారం బయటపడటంతో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌.. వైఎస్సార్‌సీపీ నేతలపై ఎదురు కేసు పెట్టారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, చోటామోటా నేతలంతా నంద్యాలలో వాలిపో యారు.

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుండడంతో ఉలికిపాటుకు గురైన టీడీపీ నేతలు ఎలాగైనా గెలవాలని ఇతర జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలను, కిరాయి రౌడీలను, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను నంద్యాలకు రప్పించుకున్నారు. వీరందరూ బృందాలుగా విడిపోయి సర్వే పేరుతో నంద్యాల నియోజక వర్గంలో ప్రతి గడపా తొక్కుతున్నారు.  కుటుంబ యజమానితో పాటు ఓటర్లు ఎంత మంది ఉన్నారని వివరాలు రాబడుతున్నారు. ఏయే ప్రభుత్వ పథకాలు కుటుంబానికి అందుతున్నాయంటూ నమోదు చేసుకుని, ఫోన్‌ నంబర్‌ కూడా తీసుకుంటున్నారు.  సర్వే పేరుతో వచ్చిన టీడీపీ బృంద సభ్యులు మాత్రం.. ‘అవన్నీ టీడీపీ వల్లే వస్తున్నాయి’ అని గట్టిగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ‘మీరు ఎవరికి ఓటేస్తారు?’ అని ఆరా తీస్తున్నారు.  

‘ఇన్ని పథకాల ద్వారా లబ్ధి పొందు తున్నారు కనుక మీరు టీడీపీకే ఓటేయాలి’ అంటూ సంతకం చేయండని ఒత్తిడి చేస్తున్నారు. కొంత మంది భయంతో సంతకం చేస్తుండగా, చేయని వారిని భయపెడు తున్నారు. ‘టీడీపీకి ఓటెయ్యకపోతే నష్టపోతా రు’ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. వారి తీరును చూసి స్థానికులు వైఎస్సార్‌సీపీ నేతలు, ‘సాక్షి’ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. నంద్యాల 31వ వార్డు మూలసాగరంలో పర్యటిస్తున్న టీడీపీ బోగస్‌ సర్వే బృందాన్ని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ నేత బుడ్డా శేషిరెడ్డి పట్టుకొని వారి గూర్చి ఆరా తీశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చామని, తమ పేర్లు సత్యనారాయణ, హర్ష అని ఇద్దరు చెప్పారు.

తాము సర్వే కోసమే వచ్చామని  బుకాయించినా.. వైఎస్సార్‌సీపీ నేత బుడ్డా శేషిరెడ్డి ఐడీ కార్డులు అడగటంతో విషయం బయటపడింది. తమను టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపినట్లు వారు స్పష్టం చేశారు. తాము చేస్తున్నది తప్పేనని ఒప్పుకున్నారు.  వారిని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. దీంతో కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యే రాధాకృష్ణ తదితరులు  నంద్యాల త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని  హంగామా చేశారు.  తప్పు ఒప్పుకున్న యువకులతో.. తమను వైఎస్సార్‌సీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ఫిర్యాదు చేయించారు. టీడీపీ నేతల దౌర్జన్యం, బరి తెగింపుపై ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ నేతలు బుడ్డా శేషిరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్‌ చేశారు.  
 
‘అక్కా.. అన్నా.. ఒకసారి బయటకు రండి.. మేం సర్వే వాళ్లం వచ్చాము..’ అని ఇంటి తలుపులు తడుతున్నారు. ఆ తర్వాత ‘మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు..? ఎవరెవరు ఏం చేస్తారు..? పింఛన్‌ సక్రమంగానే అందుతోందా..? రేషన్‌ సరుకులు తెచ్చుకుంటున్నారా..? అంటూ మాటల్లోకి దింపి ఇంటిల్లిపాది సమాచారం సేకరిస్తున్నారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఉప ఎన్నికలో ఎవరికి ఓటు వేస్తారని అడుగుతున్నారు. టీడీపీకి వ్యతిరేకమని తెలిస్తే అప్పుడు అసలు రూపం బయట పెడుతున్నారు. ‘టీడీపీకి ఓటెయ్యకపోతే పింఛన్లు ఆపేస్తాం.. రేషన్‌ కార్డులు రద్దు చేస్తాం..’ అంటూ బెదిరిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1000 మంది పలు బృందాలుగా విడిపోయి వార్డు వార్డునా ఇదే రీతిలో ‘బెదిరింపుల పర్వం’ కొనసాగిస్తుండటం విస్తుగొలుపుతోంది.