పాడి రైతులకు బంపర్‌ ఆఫర్

21 Jun, 2020 05:09 IST|Sakshi

పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు 

ఒక్కో రైతుకు రూ.1.60 లక్షల వరకు సెక్యూరిటీ లేకుండా రుణం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు లక్షల మంది పాడి రైతులకు పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న రెండు నెలల్లోనే ఈ రుణాలు ఇవ్వడానికి పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖ సహాయకులు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అభ్యుదయ రైతులు.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలనే దృక్పథం కలిగిన వారిని గుర్తించి హామీ లేకుండా రూ.1.60 లక్షలు ఇవ్వడానికి సిఫారసు చేస్తున్నారు. కరోనా కారణంగా పాడి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో వీరిని ఆదుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే.. 

► ఈ రుణాలతో రైతులు పశువులను కొనుగోలు చేయవచ్చు.  
► పశువులున్న వారైతే పశుగ్రాస సాగుకు, యాంత్రిక పరికరాల కొనుగోలుకు వాడుకోవచ్చు.   
► వారం రోజుల వ్యవధిలోనే ఆరు వేల దరఖాస్తులు తీసుకున్నారు.  
► ఒక ప్రత్యేక కార్యక్రమంగా దీనిని తీసుకుని విజయవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది.  

1.50 కోట్ల మందికి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు 
ఇదిలా ఉంటే.. దేశంలో 1.50 కోట్ల మంది పాడి రైతులకు పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  
► ఈ కార్డు ద్వారా రైతులు రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు.  
► భూమి లేని రైతులకైతే ఎటువంటి హామీలేకుండా రూ.1.60 లక్షల వరకు ఇస్తారు.  
► ఈ రుణాలపై కేంద్రం 9 శాతం వడ్డీరేటును నిర్ణయించింది.  సకాలంలో రుణం చెల్లించే రైతులకు 5 శాతం రాయితీ ఇవ్వనుంది. మిగిలిన 4 శాతం (పావలా వడ్డీ) వడ్డీని కొన్ని రాష్ట్రాలు రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.  
► రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాయితీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు అంటున్నారు.  
► రెండో దశలో మేకలు, గొర్రెల పెంపకందారులకు ఈ రుణాలు ఇస్తారు. 
కాగా, కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఈ పథకానికి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తోందని ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు