ఎంతటి వారైనా.. బురద పూసుకోవాల్సిందే..!

25 Nov, 2019 09:24 IST|Sakshi
బురదరాసుకుంటూ కేరింతలు కొడుతున్న భక్తులు(ఫైల్‌)

మహిళలకు మినహాయింపు 

నేటి అర్ధరాత్రి నుంచి బురదమాంబ జాతర 

దిమిలిలో రెండేళ్లకోసారి నిర్వహణ 

రాంబిల్లి (యలమంచిలి): బురదమాంబ జాతర.  ఎంతటివారైనా  ఆ జాతర రోజున బురద పూయించుకోవాల్సిందే. వయసుతో సంబంధం ఉండదు. మగవారు మాత్రమే పాల్గొంటారు. ఆడవారికి మినహాయింపు ఉంటుంది. ఇటువంటి వింత జాతర రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రారంభం అవుతుంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది.

వయసుతో సంబంధం లేకుండా.. 
జాతర రోజు గ్రామంలో ఉంటే ఎంతటివారైనా బురద పూయించుకోవాల్సిందే.  వయసుతో సంబంధం లేకుండా మగవారికి డ్రైనేజీల్లో బురదను పూస్తారు. ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొడతారు. ఎంతో ఉత్సాహంగా సాగే వింత పండగ. దల్లమాంబ జాతరలో భాగంగా అనుపు మహోత్సవం సందర్భంగా దిమిలిలో రెండేళ్లకోసారి ఈ జాతర నిర్వహిస్తారు.

వేపకొమ్మలను ముంచి.. 
వేపకొమ్మలను మురుగుకాలువల్లో ముంచి  బురదను ఒకరిపై ఒకరు పూసుకొని కేరింతలు కొడుతూ చిన్నారులు, యువకులు నృత్యాలు చేస్తారు.  జాతర అనంతరం వేప కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగుబంగారంలా బురదమాంబ అమ్మవారిని గ్రామస్తులు కొలుస్తారు. బురద పూసుకున్నప్పటికీ ఎటువంటి చర్మవ్యాధులు సోకకపోవడం అమ్మవారి మహిమగా భక్తులు భావిస్తారు.  ఈ జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పురవీధుల్లో దల్లమాంబ అమ్మవారి ఘటాన్ని ఊరేగించి మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు పూర్తి చేయడంతో దల్లమాంబ ఉత్సవాలు ముగుస్తాయి.  

మరిన్ని వార్తలు