ఇదేనా సంస్కారం?

9 May, 2019 13:40 IST|Sakshi
మృతదేహానికి రహదారిపైనే దహన సంస్కారాలు చేపడుతున్న రజకులు

శ్మశాన వాటిక ఆక్రమణలపై రజకుల ఆగ్రహం

కొండవూరులో రహదారిపైనే దహన సంస్కారాలు

ఐదేళ్లుగా విన్నవిస్తున్నా స్పందించని రెవెన్యూ శాఖ

వజ్రపుకొత్తూరు:మానవీయ విలువలకు పాతరేసిన సంఘటన ఇది. జానెడు భూమి కరువై మృతదేహానికి రహదారిపైనే దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. బుధవారం వజ్రపుకొత్తూరు మండలం కొండవూరు గ్రామానికి చెందిన రజకులకు ఈ దుస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన గుర్జు లక్ష్మణరావు (58) బుధవారం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో మృతదేహానికి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది. శ్మశాన వాటిక ఆక్రమణలకు గురి కావడంతో రజకులంతా ఆగ్రహించి చేసేది లేక గ్రామంలోని రహదారిపైనే శవాన్ని ఉంచి అంత్యక్రియలు కానిచ్చారు. మండలంలో ఈ సంఘటన సంచలనం రేపింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొండవూరులో సర్వే నెంబరు 413/4లో 4 సెంట్ల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. పూర్వం నుంచి ఆ భూమిని రజకులు రుద్ర భూమిగా వినియోగించుకుంటున్నారు. శ్మశాన వాటికకు తూర్పు పడమరల్లో ఉన్న రైతులు కొంతమంది ఈ స్థలాన్ని ఆక్రమించారు. దాదాపు మూడున్నర సెంట్లు కబ్జాకు గురికావడంతో రజకులంతా గత ఐదేళ్లుగా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో వినతి పత్రం కూడా అందించారు. కానీ రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో రజకుల్లోఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం గ్రామంలో వారి కులానికి చెందిన లక్ష్మణరావు మృతి చెందడంతో రహదారిపైనే అంత్యక్రియలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రెవిన్యూ అధికారులు దిగివచ్చారు.

స్పందించిన ఆర్డీఓ భాస్కరరెడ్డి
ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంలో టెక్కలి ఆర్డీఓ భాస్కరరెడ్డి స్పందించారు. వజ్రపుకొత్తూరు తహసీల్దార్‌ జి.కల్పవల్లికి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే సర్వే చేపట్టి ఆక్రమణలు తొలగించి రజకుల దహన సంస్కారాలకు అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వజ్రపుకొత్తూరు సర్వేయర్‌ కొండప్ప తిరుపతిరావు, వీఆర్‌ఓ తారకేశ్వరరావు, ఎస్‌ఐ పి.నరసింహమూర్తి తన సిబ్బందితో శ్మశాన వాటిక వద్దకు చేరుకొని రజకులతో మాట్లాడారు. సర్వే చేపట్టి ఆక్రమణల్లో ఉన్న మూడున్నర సెంట్లకు విముక్తి కలిగించారు. ఇది ప్రభుత్వ భూమని, ఎవరైనా ఆక్రమణలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్‌ఐ ఆక్రమణదారులను హెచ్చరించారు. దీంతో రజకుల దహన సంస్కారాలకు అడ్డంకులు తొలిగాయి.

మరిన్ని వార్తలు