పంట పొలాలు తగులబెట్టడం అమానుషం

30 Dec, 2014 03:27 IST|Sakshi
పంట పొలాలు తగులబెట్టడం అమానుషం

అనంతపురం అగ్రికల్చర్ : రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. భూములు ఇవ్వని రైతులపై కన్నెర చేస్తూ వారి పంట పొలాలను తగులబెట్టి భయాందోళనకు గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పంట పొలాలకు నిప్పుపెట్టడమే కాకుండా ఆ అపవాదును తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ సోమవారం రాత్రి నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార  ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దిభాస్కర్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోభిలేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ... పంట పొలాలను తగులబెట్టి రైతులకు తీరని నష్టం కలగజేయడంతో పాటు భయభ్రాంతులు సృష్టించడం దారుణమన్నారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందకుండా వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్పచారం చేయడం ప్రభుత్వ నీచరాజకీయాలకు పరాకాష్టగా అభివర్ణించారు.

రాజధాని ముసుగులో రైతుల పొలాలను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం అమానుష చర్య అన్నారు. దారికి రాని రైతులను ఇలాంటి సంఘటనలతో బెదరించేందుకు దిగడం అన్యాయమన్నారు. ఆదివారం రాత్రి ఒకేసారి 8 గ్రామాల్లో రైతుల పంట పొలాలను తగులబెట్టడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని రైతులు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. దగ్ధమైన పంటకు నష్టపరిహారం అందించడమే కాకుండా రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.విద్యాసాగర్‌రెడ్డి, కేవీ మారుతీప్రకాష్, మహబూబ్‌పీరా, సురేష్‌రెడ్డి, గోవిందరెడ్డి, జయపాల్, కనేకల్లు లింగారెడ్డి, వాయలశ్రీనివాసులు, మర్రి రాజారెడ్డి, మోసెస్, ఫకృద్ధీన్, ముక్తియార్, నూర్‌మహమ్మద్, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు