తూర్పుగోదావరి జిల్లాలో లోయలోపడ్డ టెంపో

15 Oct, 2019 12:35 IST|Sakshi

సాక్షి, చింతూరు: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు టెంపో వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. భద్రాచలం నుంచి అన్నవరం బయలుదేరిన టెంపో(ఏపీ 16 టీడీ 6849) మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో వాలీ-సుగ్రీవుల కొండ వద్ద ప్రమాదానికి గురైంది. ఘాట్‌ రోడ్డులో సుమారు 20 అడుగుల పైనుంచి లోయలోకి పడిపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్నవారంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అధి​కారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని తూర్పుగోదావరి జిల్లా రూరల్‌ ఎస్పీని ఏలూరు రేంజ్‌ డీఐసీ ఏఎన్‌ ఖాన్‌ ఆదేశించారు.

కర్ణాటకలోని చిత్రకూట్‌ దగ్గర చర్లకేళ్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారు 24 మంది రెండు వాహనాల్లో బయలు దేరారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వస్తుండగా ఒక వాహనం ప్రమాదానికి గురైంది. మారేడుమిల్లి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా కారణంగానే దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా
మారేడుమిల్లి ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మరిన్ని వార్తలు