డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా

15 May, 2016 03:43 IST|Sakshi

ఉంగుటూరు/ తాడేపల్లిగూడెం రూరల్ : ఉంగుటూరు మండలం బాదంపూడి- ఉప్పాకపాడు గ్రామాల మధ్య  ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..  కాకినాడకు చెందిన మేఘనా ట్రావెల్స్ వోల్వో బస్సు హైదరాబాద్ వెళుతోంది.
 
  బాదంపూడి సమీపంలోకి రాగానే కాలినడకన ద్వారకాతిరుమలకు వెళ్తున్న  భక్తులను తప్పించబోయి అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నల్లమిల్లి బావిరెడ్డి (నర్సిపూడి), దొంగ దేవి (సందిపాడు), ఆమె కుమార్తె దొంగ తేజస్వి (10), కంటిపూడి సాయి సమిత్ (కాకినాడ), అమర్తుల తంబి (కాకినాడ)కు తీవ్ర గాయాలయ్యాయి. నల్లమిల్లి సత్యవతి (నర్సిపూడి), సమిళ్ళ సాయిరెడ్డి (నర్సిపూడి), నల్లా లక్ష్మిలతోపాటు మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత  నల్లమిల్లి బావిరెడ్డి, కంటిపూడి సాయిసమిత్‌ను మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
 
  ప్రథమ చికిత్స అనంతరం మిగిలిన వారు తమ ప్రాంతాలకు తరలివెళ్ళినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు వైద్యసేవలందించడంలో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయ సిబ్బంది సహకరించారు. ప్రమాద సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్ సంస్థ జేకే సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు