ఆన్‌లైన్‌లో బస్‌పాసులు

19 Jun, 2015 01:14 IST|Sakshi

శ్రీకాకుళం అర్బన్ :  విద్యార్థులు బస్సు పాసులను ఆన్‌లైన్‌లో పొందాలని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కుప్పిలి శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ డీసీటీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆర్టీసీలో సమయపాలన, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బస్ పాసులు ఆన్‌లైన్ విధానంలో అందజేయడం మొదటిసారన్నారు. ఉత్తరాంధ్రలో నెక్ రీజియన్‌లో దీన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పాసు కోసం క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని చెప్పారు.  డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఏపీఎస్ ఆర్టీసీ పాస్. ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. బస్‌పాస్‌లు పొందిన విద్యార్థులు రెన్యువల్ కోసం సంస్థ నుంచి ఒక మెసేజ్ వస్తుందని, దీని ప్రకారం పాస్‌లు అప్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎంఎస్‌టీ, పీహెచ్. క్యాట్, నవ్య, వనిత కార్డులను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు.
 
 పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
 వచ్చేనెల 14వ నుంచి 25వ తేదీ వరకూ జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 115 బస్సులను నడపనున్నామన్నారు. ముఖ్యంగా 18, 19, 20 తేదీలలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచే అవకాశం ఉందన్నారు. వీటికి సంబందించి ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు బస్సులను నడుపుతామన్నారు. అలాగే విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు.  సమావేశంలో ఆర్టీసీ ఒకటి, రెండు డిపోల మేనేజర్లు డి.ఢిల్లేశ్వరరావు, నంబాళ్ల అరుణకుమారి, బస్ స్టేషన్ మాస్టర్ బీఎల్‌పీ రావు, ఓపీఆర్‌ఎస్ ప్రతినిధి ఎం.డి.బాషా పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు