రూ. 25కే కిలో ఉల్లిపాయలు

27 Sep, 2019 08:20 IST|Sakshi

జిల్లాలోని నాలుగు రైతు బజార్ల నుంచి పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

మొదట విడతగా ఒంగోలులో మూడు, కందుకూరులో ఒక రైతుబజారు ద్వారా విక్రయం

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉల్లిగడ్డల అవసరాలు తీర్చేందుకు జిల్లాకు 5 టన్నులు కేటాయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు బజార్ల ద్వారా వాటిని ప్రజలకు విక్రయించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వమే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే మొదటి విడతగా జిల్లాలోని నాలుగు రైతు బజార్ల ద్వారా విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఏడీ కె.వి.ఎన్‌.ఉపేంద్ర కుమార్‌ రైతు బజార్ల సిబ్బందిని ఇప్పటికే సన్నద్ధం చేశారు. కర్నూలు జిల్లా నుంచి ఒంగోలు నగరానికి గురువారం అర్ధరాత్రికి లారీల ద్వారా ఉల్లిగడ్డలు చేరుకోనున్నాయి.

అందుకోసం ఒంగోలు నగరంలోని మూడు రైతు బజార్లలో శుక్రవారం నుంచి ఉల్లిగడ్డలు విక్రయించే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కందుకూరు రైతు బజారుకు శుక్రవారం నేరుగా కర్నూలు జిల్లా నుంచి ఉల్లిగడ్డలు లారీల ద్వారా చేరుకోనున్నాయి. ఒంగోలులో నగరంలో లాయరు పేట సాయిబాబా గుడి పక్కన, ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురు దిబ్బల రోడ్డులో, కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌లోని రైతు బజార్ల నుంచి ఉల్లిగడ్డలు విక్రయిస్తారు. ఒక్కో కుటుంబానికి ఒక కిలో చొప్పున మొదట అందజేస్తారు. కిలో ఉల్లిగడ్డలు రూ. 25 చొప్పున విక్రయిస్తామని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఏడీ కె.వి.ఎన్‌.ఉపేంద్ర కుమార్‌ తెలిపారు. ఉల్లిగడ్డల కోసం వచ్చే వారు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు తీసుకొని రైతు బజార్లకు రావాలని ఆయన సూచించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి ఉల్లిగడ్డలు తెప్పించేందుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అక్కడ భారీ వర్షాలు పడుతుండటంతో రోడ్డు రవాణాకు పూర్తిగా ఆటంకం ఏర్పడటంతో తొలుత కర్నూలు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు