జేబు నింపుకొంటున్న సీఎం: బీవీ రాఘవులు

13 Feb, 2014 00:27 IST|Sakshi
జేబు నింపుకొంటున్న సీఎం: బీవీ రాఘవులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఉపయోగపడే ఫైళ్లపై సంతకాలు చేయడం మానేసి తన జేబు లు నింపుకొనేందుకు సొంత సంతకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శిం చారు. అంగన్‌వాడీ సిబ్బందికి కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాఘవులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. గత 15 రోజులుగా సీఎం  సొంత సంతకాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. సీఎం పదవిలో ఉంటారో లేదో తెలియని  మీరు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తే వారికి గుర్తుండిపోతారని కిరణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
 మహిళల సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్‌వాడీల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. అంగన్‌వాడీల్లో ఐకేపీ జోక్యాన్ని నివారించాలని, పెండింగ్ బిల్లులు, పెంచిన అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక దీక్షలో సాయిబాబా (సీఐటీయూ), చంద్రశేఖర్ (ఐఎన్‌టీయూసీ), రాంబాబు (టీఎన్‌టీయూసీ), నరసింహ (ఏఐటీయూసీ), పోటు ప్రసాద్ (ఐఎఫ్‌టీయూ), ఆలిండియా బీమా ఉద్యోగుల సంఘం కర్ణాటక, ఏపీ జోనల్ కార్యదర్శి క్లెమెంట్ దాస్, మహిళా విభాగం కన్వీనర్ అరుణకుమారి, ఆశా వర్కర్స్ నేత హేమలత, లోక్‌సత్తా నేత భవానీ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోటిలింగం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు