బండిపై బేరం... బతుకు భారం

7 Oct, 2014 00:10 IST|Sakshi
బండిపై బేరం... బతుకు భారం

 
 సత్తెనపల్లి
 రోజంతా వీధుల్లో తిరిగితేనే వీధి వ్యాపారుల పొట్ట నిండేది. తోపుడు బండ్లనే నమ్ముకుని వీధుల వెంట తిరుగుతూ ఏరోజు కారోజు పెట్టుబడితో వ్యాపారం చేస్తున్న వారి బతుకులు దుర్భరమవుతున్నాయి. వారి కోసం ప్రత్యేక జోన్‌లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచలేదు.
     వీధి వ్యాపారులను గుర్తించి ఆర్థిక చేయూతనివ్వాలని మెప్మాకు మూడేళ్ల కిందట కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే సిబ్బంది కాకి లెక్కలు చూపారు.
     సుప్రీం కోర్టు సమగ్ర సర్వే చేయాలని, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రత్యేక వాణిజ్య జోన్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో జిల్లాలోని 12 పురపాలక సంఘాలు, గుంటూరు నగరంలో మరోసారి సర్వేకు శ్రీకారం చుట్టారు.
     పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని పట్టణాల్లో సామాజిక కార్యకర్తలను ఎంపిక చేసి సమగ్ర సర్వే ప్రారంభించారు. మెప్మాలోని సిబ్బంది వారిని పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో వీధి వ్యాపారి నుంచి వివరాలు సేకరించి దరఖాస్తులో నమోదు చేసి ఈ నెలాఖరులోగా సర్వే ముగించాల్సి ఉంది.
 ఇది ముఖ్యం...
     వీధి వ్యాపారి పాస్‌పోర్టు సైజు ఫొటో, వారి కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తాను ఏ ప్రాంతంలో, ఏ వస్తువులు విక్రయిస్తున్నాడో ధ్రువీకరించిన పత్రం ఇవ్వాల్సి ఉంది.
 ఆన్‌లైన్‌లో.........
     జిల్లాలోని తెనాలి, నరసరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట, మాచర్ల, మంగళగిరి, పిడుగురాళ్ల, పొన్నూరు, సత్తెనపల్లి, రేపల్లె, తాడేపల్లి, వినుకొండ పురపాలక సంఘాల్లో 5,859 మందిని, గుంటూరు కార్పొరేషన్‌లో 2,769 మంది వీధి వ్యాపారులను గుర్తించారు.
     వారి నుంచి దరఖాస్తులు తీసుకుని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ఈ నెలాఖరులోగా నమోదు చేసుకుని, ఆధార్‌కు అనుసంధానం చేయనున్నారు.
     రోడ్డు ఆక్రమణల పేరుతో పట్టణాల్లో నిత్యం ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులకు గురవుతున్న వీధి వ్యాపారుల సమస్యలు తీరాలంటే వాణిజ్య జోన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.



 

>
మరిన్ని వార్తలు