కష్టాలే ప్లాట్‌ఫాం.. నవ్య సోపానం

24 Feb, 2018 11:03 IST|Sakshi

అమ్నానాన్నలకు చేదోడు వాదోడు..

రోజూ టిఫిన్‌ విక్రయాల్లో సహకారం

ప్రతిభ చాటుకుంటున్న నవ్య

బతుకు బండిని లాగేందుకు ప్లాట్‌ఫాంపై టిఫిన్‌ బండి నడుపుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఆమెలో కసిపెంచాయి. వారి ఆశలను, తన ఆశయాలను నెరవేర్చేందుకు చదువొక్కటే మార్గమని భావించింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూనే చదువులో సత్తా చూపింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించి, ప్రస్తుతం చెన్నైలోని ఓ సంస్థలో ఆర్టికల్‌షిప్‌ చేస్తోంది పాకాల మండలానికి చెందిన వి.నవ్య. ఆమె గురించి ఆమె మాటల్లోనే.. – తిరుపతి ఎడ్యుకేషన్‌

మాది పాకాల మండలం వల్లివేడు గ్రామం. మా తల్లిదండ్రులు వి.శివారెడ్డి, వి.గోమతిలకు మేం ముగ్గురు సంతానం. అక్క వి.నందిప్రియ నీట్‌కు సిద్ధమవుతోంది. నేను రెండో కుమార్తెను. చెల్లెలు వి.దివ్య ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. వ్యవసాయం పెద్దగా అచ్చిరాలేదు. మా ఉన్నత చదువుల కోసం అమ్మానాన్న పొట్ట చేత్తో పట్టుకుని మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చేశారు. రుయా ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై టిఫిన్‌ బండి పెట్టారు. వచ్చే ఆదాయంతో మమ్మల్ని చదివిస్తున్నారు.– సీఏ–ఐపీసీసీ ఆలిండియా 21వ ర్యాంకర్‌ వి.నవ్య

కష్టాలు కసి పెంచాయి..
మా ముగ్గురిని చదివించేందుకు అమ్మాన్నాన్న ఎంతో కష్టపడుతున్నారు. సొంత ఊరిని వదిలిపెట్టి తిరుపతికి వచ్చారు. ఫ్లాట్‌ఫాంపై టిఫిన్‌ బండి నడుపుతున్నారు. వారు పడుతున్న కష్టం, బాధ చూసి నాలో కసి పెరిగింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించాను.

చదువు ప్రస్థానం..
పదో తరగతి వరకు పాకాల మండలం, రమణయ్యగారిపల్లెలోని వశిష్ఠ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. పదిలో 9.5 గ్రేడ్‌ పాయింట్లు సాధించాను.  మదనపల్లిలోని జవహర్‌ నవోదయలో ఎంపీసీ చేశాను. 94.4శాతం మార్కులను సాధించాను. సీఏ చేయాలన్న కోరికతో తిరుపతిలోని ఎమరాల్డ్స్‌ కళాశాలలో 6నెలలు సీఏ–సీపీటీలో శిక్షణ తీసుకున్నా. ఇంటర్‌ మార్కుల ఆధారంతో సీపీటీలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ పరీక్షలో 200కు 177మార్కులు సాధించడంతో సెకెండ్‌ లెవెల్‌ అయిన సీఏ–ఐపీసీసీలోనూ ఎమరాల్డ్స్‌ కళాశాల యాజమాన్యం 9నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు సాధించగలిగాను. సీఏ ఫైనల్‌ చేయాలంటే తప్పనిసరిగా రెండున్నర ఏళ్ల పాటు ఆడిటర్‌ వద్ద ఆర్టికల్‌షిప్‌ చేయాలి. దీనికోసం చెన్నైలోని డెలాయిట్‌ సంస్థలో చేరాను. సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్‌ ముందుగానే చేసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చును ఎమరాల్డ్స్‌ కళాశాల యాజమాన్యం భరించింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

తల్లిదండ్రులకు సాయంగా..
అమ్మానాన్న ఇద్దరూ టిఫిన్‌ బండిపై కష్టపడేవారు. వారి కష్టంలో నేను కూడా పాలుపంచుకోవాలని వారికి సాయంగా ఉంటున్నాను. టిఫిన్‌ బండిపై దోసెలు పోస్తూ, వచ్చిన కస్టమర్లకు టిఫిన్‌ వడ్డిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నా. ఖాళీ సమయంలో చదువుపైనే దృష్టి పెడుతున్నా.

సివిల్స్‌ సాధించడమే నా కల...
సీఏ పూర్తయిన తరువాత సివిల్స్‌కు సిద్ధమవుతాను. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కావడమే నా కల. నాలాంటి పేద విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా వారికి అండగా నిలవడానికి, మరెందరో పేదలకు సేవ చేయడానికి తప్పకుండా నా కలను సాకారం చేసుకుంటా. నా తల్లిదండ్రుల ఆశలను నెరువేరుస్తా.

మరిన్ని వార్తలు