తెలుగు రాష్ట్రాల్లో ‘పౌరసత్వ’ ప్రకంపనలు

27 Dec, 2019 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఆందోళనలు పోటెత్తాయి. మైనారీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న ఈ రెండింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిపారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరులో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు ముస్లింలు కదం తొక్కారు. నమాజ్ అనంతరం భారీ సంఖ్యలో యువత, మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ప్రజావ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ రద్దు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీకి మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉయ్యూరు సెంటర్‌లో ప్రార్ధనలు జరిపారు. గన్నవరం, హనుమాన్ జంక్షన్‌లలో ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ నినదించారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకమన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పిడుగురాళ్లలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ర్యాలీలో పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీకి నిరసనగా ముస్లింలు మానవహారం పాటించారు. తర్వాత డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. నిడదవోలులోముస్లింలు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిడదవోలు ముస్లిముల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా సీపీఎం  ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వర రావు, ఎస్ఎఫ్ఐ, ముస్లిం, సెక్యులర్, దళిత, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలోనూ జనాగ్రహం
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మైనార్టీలు భారీ ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణములో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇతర పార్టీల నాయకులు సభ​కు హాజరయ్యారు. (చదవండి: ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ రెండూ ఒకటే)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా