బుల్లితెర వినోదం ఇక భారమే..!

1 Feb, 2019 13:30 IST|Sakshi

ఫిబ్రవరి నుంచి కొత్త విధానం అమలులోకి

డీటీహెచ్‌ తరహాలో ముందస్తు చెల్లింపులు

ఆందోళన చెందుతున్న వినియోగదారులు

సత్తెనపల్లి:  కేబుల్‌ కనెక్షన్‌ పేదలకు ఇక భారం కానుం ది. ఇప్పటివరకు కేబుల్‌ కనెక్షన్‌ ఉంటే నెల పూర్తయిన తరువాత ఆయా ప్రాంతాలను బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా 200 నుంచి 250 చానళ్లు ప్రసారం అయ్యేవి. ఇందులో 80 వరకు పే చానళ్లు ఉండేవి. వీటిలో వార్తా చానళ్లు, స్పోర్ట్స్‌ చానళ్ళు, వినోద చానళ్ళు, హిందీ, ఇంగ్లిషు, ఒరియా, తమిళం, మళయాళం తదితర భాషల చానళ్లు ఉండేవి. ప్రస్తుతం నూతన నిబంధనల ప్రకారం 150 ఎయిర్‌ ఫ్రీ చానళ్లు (జనరల్‌)కు రూ.130తో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు కావాలనుకునే పే చానళ్లను ఎంపిక చేసుకుని వాటి రుసుం చెల్లిస్తే వారు కోరుకున్న చానళ్ల ప్యాకేజీలు మాత్రమే ప్రసారం అవుతాయి. ప్రస్తుతం కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా ప్రసారం అవుతున్న చానళ్లన్నీ  ఫిబ్రవరి ఒకటి నుంచి చూడాలంటే రూ.300 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సి వస్తుంది. గతంలో ఇంత పెద్ద మొత్తం డీటీహెచ్‌ల ద్వారా వినియోగదారులు చెల్లించేవారు. తాజాగా దేశవ్యాప్తంగా డీటీహెచ్, కేబుల్‌ వినియోగదారులందరూ తాము చూస్తున్న చానళ్లకు చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని కల్పించినా, దీని వల్ల వినియోగదారులపై భారం పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

రూ.250 నుంచి రూ.300 వరకు...
ఉదాహరణకు కేబుల్‌ కనెక్షన్‌ ఉన్న వినియోగదారుడు ఎయిర్‌ ఫ్రీ చానళ్ల కోసం రూ.130, దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా జీటీవీ,  మాటీవీ, జెమిని, ఈటీవీ వంటి చానళ్లు చూడాలనుకుంటే ఆయా ప్యాకేజీలకు ఆయా యాజమాన్యాలు నిర్దేశించిన మొత్తాన్ని జోడించి దానికి జీఎస్టీని కలిపి ఆపరేటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన కేవలం తెలుగు చానళ్లనే ఎంపిక చేసుకుంటే నెలకు రూ.250 నుంచి రూ.280 వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్, ఇతర చానళ్లు కావాలంటే మరికొంత డబ్బు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కాకుండా ఇతర చానళ్లు కావాలంటే మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్‌ నిర్ణయంపై సుప్రీం కోర్టులో కేసు వేసినప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ట్రాయ్‌ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుందని భావిస్తున్నారు.  దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి కచ్చితంగా కొత్త రేట్లు, కొత్త విధానం అమలులోకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేబుల్‌ ఆపరేటర్‌ల సంఘం, దేశంలోని కొన్ని కేబుల్‌ ఆపరేటర్‌ల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు ఆరు నెలలు గడువు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చి వినియోగదారులకు భారం అయ్యే పరిస్థితి ఉంటుంది.

మరిన్ని వార్తలు