స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

18 May, 2019 10:55 IST|Sakshi
మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి

సాక్షి, అనంతపురం సిటీ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో నగరంలోని డివిజన్‌ కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమష్టిగా కృషి చేయడం వల్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపాలన్నారు. నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని, 50 డివిజన్లలోనూ విజయఢంకా మోగించాలని ఆకాంక్షించారు.

ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూ చించారు. కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ఇప్పటికే విడుదల చేశారని, మార్పులు, చేర్పులు ఉంటే పరిశీలించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారని, కార్యకర్తలంతా కష్టపడి జాబితాలో చేర్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. పదవుల విషయంలో ఎవరికీ అనుమానాలు, భయాలు వద్దని, కష్టపడి పని చేసేవారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయం సాధిస్తే సరిపోదని, కార్పొరేషన్‌ మేయర్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటేనే నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లవచ్చన్నారు. గతంలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓడిపోయామని, ప్రస్తుతం అలాంటి తప్పు జరగకుండా డివిజన్లలో కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్లాలన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే పోలింగ్‌ శాతం మరింత పెరిగేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా పొరపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే అన్నింటినీ కలిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం, పార్టీ సీనియర్‌ నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పెన్నోబుళేసు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సాకే చంద్ర, కార్పొరేటర్లు బాలాంజనేయులు, జానకి, గిరిజ, శ్రీదేవి, డివిజన్‌ కన్వీనర్లు పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తలు