పట్టిసీమ.. ఆద్యంతం దోపిడీ పర్వం

1 Apr, 2017 05:38 IST|Sakshi
పట్టిసీమ.. ఆద్యంతం దోపిడీ పర్వం

కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దల కుమ్మక్కును కడిగిపారేసిన కాగ్‌
- అప్పనంగా రూ.199 కోట్లు బోనస్‌ ఇచ్చారని ఆక్షేపణ  

సాక్షి, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ప్రభుత్వం సాగించిన దోపిడీ పర్వాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక ఏకిపారేసింది. ముందస్తు ప్రణాళిక లేకుండా, పోలవరం కుడి కాలువ డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టకుండా.. గృహ, పారిశ్రామిక లబ్ధిదారులను గుర్తించకుండా పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టడాన్ని తప్పుబట్టింది. రూ.372.02 కోట్లు కాంట్రాక్టర్‌కు అనుచితంగా లబ్ధి చేకూర్చిందని ఎత్తి చూపింది. ఇంత చేసినా పోలవరం ముందస్తు ఫలాలు నిర్దేశించిన వారికి అందించలేకపోయిందని పేర్కొంది. 2015 – 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్‌.. శాసనసభకు సమర్పించిన నివేదికలో  ‘పట్టిసీమ’ బాగోతాన్ని స్పష్టంగా వివరించింది.  

టెండర్ల నిబంధనలు సడలించి అక్రమాలు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల అంచనా విలువ టెండర్లలో పేర్కొన్న ప్రకారం రూ.1,170.25 కోట్లు. జీవో 94 ప్రకారం ఐదు శాతానికి మంచి అదనపు ధరకు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించకూడదు. కానీ, 21.999 శాతం అదనపు ధరతో మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(మేఘా) సంస్థ షెడ్యూలు దాఖలు చేసింది. ఐదు శాతం అదనపు ధరకు.. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్‌ ఇచ్చేలా నిబంధనలు సడలించి మేఘాకే పనులు అప్పగించిందని, దీని వల్ల అంచనా వ్యయం పెరిగిందని కాగ్‌ తేల్చింది. కానీ.. ఒప్పంద కాలంలోనే భూసేకరణ పూర్తి చేయడంతో పాటు డిజైన్లను సత్వరమే ఆమోదించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జల వనరుల శాఖ పట్టిసీమ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసింది. దీని వల్ల పనులు ఏడాదిలోగా పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గడువులోగా పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు రూ.199 కోట్లను బోనస్‌ రూపంలో ఇవ్వడాన్ని కాగ్‌ తప్పుబట్టింది.  



అవసరం లేకున్నా డయాఫ్రమ్‌ వాల్‌
పట్టిసీమ ఎత్తిపోతలకు సంప్రదాయ పద్ధతుల్లో రూ.147 కోట్లతో పంప్‌ హౌస్‌ నిర్మించాలని అంచనాల్లో సర్కార్‌ పేర్కొంది. కానీ.. డయా ఫ్రమ్‌ వాల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పంప్‌ హౌస్‌ నిర్మాణానికి అనుమతించడం వల్ల అంచనా వ్యయం రూ.253.17 కోట్లకు పెరిగింది. పంప్‌ హౌస్‌ నిర్మాణంలో బేసిక్‌ పెరామీటర్లలో మార్పేమీ లేకున్నా కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.106.17 కోట్లను అనుచితంగా లబ్ధి చేకూర్చారని కాగ్‌ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని జలవనరుల శాఖను ప్రశ్నించగా, తప్పును అంగీకరించిందని పేర్కొంది. కానీ.. కేవలం రూ.100 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్‌కు అదనంగా చెల్లించామని జల వనరుల శాఖ వివరణ ఇచ్చిందని, ఈ వివరణ కూడా ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది.

పన్ను మినహాయించినా దోచిపెట్టారు..
సాగు, తాగునీటి పథకాలకు వినియోగించే పైపులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పన్నును పూర్తిగా మినహాయించింది. కానీ.. పట్టిసీమ ఎత్తిపోతల కాంట్రాక్టర్‌కు పైపులపై రూ.32.01 కోట్లను ఎక్సైజ్‌ పన్నుల రూపంలో సర్కారు చెల్లించడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయంలోనే ఒక శాతం కార్మిక సంక్షేమ పన్నును చేర్చారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్‌ నుంచి రూ.14.22 కోట్లను జల వనరుల శాఖ వసూలు చేయాలి. కానీ.. కార్మిక సంక్షేమ పన్ను రూపంలో కాంట్రాక్టర్‌కు రూ.14.22 కోట్లను అక్రమంగా తిరిగి చెల్లించి.. అనుచిత లబ్ధి చేకూర్చారని కాగ్‌ తేల్చింది. మొత్తంగా కాంట్రాక్టర్‌కు రూ.372.02 కోట్ల మేర అనుచితంగా లబ్ధి చేకూర్చిందని కాగ్‌ స్పష్టం చేసింది.

ముందస్తు ఫలాలు దక్కిందెక్కడ?
పట్టిసీమ ఎత్తిపోతలను 2016 మార్చి నాటికి పూర్తి చేసినా పోలవరం కుడి కాలువ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేయలేదు. దీని వల్ల 24 పంపులతో నీటిని తరలించాల్సి ఉండగా.. కేవలం 11 పంపుల ద్వారానే నీటిని ఎత్తిపోయగలిగారని కాగ్‌ ఎత్తి చూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులు చేయకపోవడం వల్ల పోలవరం కుడి కాలువ కింద 1.2 లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోయారని స్పష్టం చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 20 ఏళ్ల(లైఫ్‌ టైమ్‌)పాటు పని చేస్తుందని ప్రభుత్వం పేర్కొంటూనే.. మరోవైపు 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. ఇది పూర్తయితే పట్టిసీమ ఉపయోగించమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టిసీమ పథకం పనిచేసేది కేవలం మూడేళ్లేనని, పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయితే ఇది అనవసరమని కాగ్‌ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు