అ అంటే అవినీతి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌

8 Apr, 2018 02:01 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను ఏకిపారేస్తూ కాగ్‌ నివేదిక

రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తన నివేదికలో ఏకి పారేసింది. అంచనా వ్యయాలను పెంచేస్తూ కాంట్రాక్టర్లకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చడాన్ని తూర్పారబట్టింది. అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ నిధులను దారి మళ్లిస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడిందని హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు, సీబీఐ తేల్చిన కాంట్రాక్టు సంస్థకే అధిక ధరలకు కాంట్రాక్టును అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు సభకు జనసమీకరణ కోసం పాల కేంద్రానికి చెందిన రూ.22 లక్షలను వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖజానా శాఖ చెబుతోన్న లెక్కలకూ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకూ పొంతనే లేదని కాగ్‌ తేల్చిచెప్పింది. ఆర్థిక క్రమశిక్షణలో అడుగడుగునా ఉల్లంఘనలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికతో అక్రమాలు బట్టబయలవడంతో సర్కార్‌ ఆత్మరక్షణలో పడింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక నియమావళి సెక్షన్‌ 3 ప్రకారం వ్యక్తిగత చెక్కుల రూపంలో ఎలాంటి నిధులను విడుదల చేయకూడదు. కానీ.. నిధులు మురిగిపోవడాన్ని తప్పించుకునే ముసుగులో భారీగా నిధులను దారిమళ్లించినట్లు నిర్ధారించింది.

2016–17లో జిల్లాల ఖజానా అధికారులు రూ.257.89 కోట్లను వ్యక్తిగత చెక్కుల రూపంలో జారీ చేశారని.. వివిధ బ్యాంకుల మేనేజర్ల పేరుతో రూ.1,325.88 కోట్ల విలువైన 353 చెక్‌లను జారీ చేసినట్లు గుర్తించింది. మొత్తం రూ.1,583.77 కోట్ల నిధులను ఏ పనుల కోసం చెల్లించారన్నది చెక్కుల్లో పేర్కొనలేదని స్పష్టం చేసింది. ఆ నిధులు మొత్తం దారిమళ్లినట్లు భావిస్తున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే మార్చి నెలలో భారీ ఎత్తున నిధులు ఖర్చు అయినట్లు సర్కార్‌ లెక్కలు చూపడంపై కాగ్‌ నివ్వెరపోయింది. సచివాలయంలో ఆర్థిక సేవలు పేరుతో ఏడాది మొత్తం రూ.868.81 కోట్లు ఖర్చు చేస్తే.. ఒక్క మార్చి నెలలోనే రూ.426.23 కోట్లు ఖర్చు చేసినట్లు చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

హైకోర్టు, సీబీఐ అక్రమార్కుడని తేల్చినా
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ఫలకాల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)ప్రాజెక్టులో లింక్‌ పాయింట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎల్‌ఐపీఎల్‌) అక్రమాలకు పాల్పడినట్లు హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే ప్రాజెక్టు అమలులో అక్రమాలకు పాల్పడటంతో ఉత్సవ్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (యూఎస్‌ఎస్‌ఎల్‌)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమాలకు పాల్పడిన ఈ సంస్థలు ఏర్పాటు చేసిన కన్సార్టియంకు అధిక ధరకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్రాజెక్టును అప్పగించడంపై కాగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కన్సార్టియంకు పనులు అప్పగించవద్దంటూ ఏపీఎస్‌ఆర్‌టీసీ న్యాయ సలహాదారు ఇచ్చిన న్యాయ అభిప్రాయాన్ని కూడా తోసిపుచ్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక్కో ఫలకం సగటున రూ.119 నుంచి రూ.146కు ఇదే సంస్థ అమర్చితే.. రాష్ట్రంలో మాత్రం ఒక్కో ఫలకం అమర్చడానికి ఆ సంస్థకు రూ.220.34 చెల్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చింది.

కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి
రాష్ట్రంలో నిర్మాణంలోని 44 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.27,403.74 కోట్లు పెంచేసినా ఒక్క ప్రాజెక్టునూ ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.49,107.78 కోట్లు. వివిధ కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుందని.. వాటిని మార్చి 31, 2017 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన సర్కార్‌ అంచనా వ్యయాన్ని రూ.76,511.52 కోట్లకు పెంచేసింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చినట్లు కాగ్‌ ఎత్తిచూపింది. 2016–17లో ‘నీరు–చెట్టు’ పథకానికి బడ్జెట్‌లో రూ.135 కోట్లు కేటాయించి.. చివరికి రూ.1,242 కోట్లు ఖర్చు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  

ఎక్సైజ్‌ శాఖలో 143.46 కోట్ల లూటీ
ఎక్సైజ్‌ శాఖ్‌లో అస్మదీయులకు రూ.143.46 కోట్లు దోచిపెట్టడంపై కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 2 వేల లక్షల ప్రూఫ్‌ లీటర్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తామని అంగీకార లేఖ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) ఇచ్చారు. ఇందుకు ఫీజు కింద రూ.129 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ డిస్టిలరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని వెయ్యి లక్షల ప్రూఫ్‌ లీటర్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం ఓకే చెప్పడాన్ని కాగ్‌ ఆక్షేపించింది. దీని వల్ల ఎస్పీవై రెడ్డి సంస్థకు రూ.60 కోట్లకుపైగా లబ్ధి చేకూర్చినట్లు గుర్తించింది. అటు విత్తనాభివృద్ధి సంస్థలో చోటుచేసుకున్న అవకతవకలను తూర్పా రబట్టింది. 2015–16 రబీలో జేజీ–11 అనే శనగ సర్టిఫైడ్‌ విత్తనాల సేకరణలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు 3సార్లు విత్తన ధరను పెంచారు. దాంతో.. రూ.38.24 కోట్లు దుర్విని యోగమయ్యాయని కాగ్‌ తేల్చింది. విత్తన పంపిణీ ఏజెన్సీల నుంచి 12.26 కోట్ల బకాయిలు వసూలు చేయకపోవడాన్ని ఎత్తి చూపింది. 

అస్మదీయ కాంట్రాక్టర్‌ కోసం..
ఏపీ జెన్‌కోలో కాంట్రాక్టర్లకు అడుగులకు అధికారులు మడుగులొత్తడం వల్ల భారీ ఎత్తున నిధులు దారిమళ్లినట్లు కాగ్‌ గుర్తించింది. నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో బూడిద చెరువు–2ను పటిష్ఠం చేసే పనులను రూ.30.21 కోట్లకు కేసీఎల్‌– ఆర్‌వీఆర్‌(జేవీ) సంస్థకు అప్పగించారు. ఒప్పందం ప్రకారం మట్టి ఎంత దూరం నుంచి తెచ్చినా ఏపీ జెన్‌కోకు సంబంధం ఉండదు. అదనపు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మట్టిని 42 కి.మీల దూరం నుంచి తెచ్చానని.. అదనపు బిల్లులు ఇవ్వాలన్న కాంట్రాక్టర్‌ ప్రతిపాదనను అంగీకరించడంతో రూ.7.10 కోట్లు దుర్వినియోగమయ్యాయని కాగ్‌ తేల్చింది. 

సీఎం సభ జనసమీకరణ కోసం
గ్రామీణ నీటి సరఫరా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ), గిరిజన ప్రాంత అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో రూ.42.92 కోట్లను దుర్వినియోగం చేసినట్లు కాగ్‌ ఎత్తి చూపింది. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు సభకు జనసమీకరణ కోసం పాల కేంద్రానికి చెందిన రూ.22 లక్షలను దుర్వినియోగం చేసినట్లు తేల్చింది. 

మరిన్ని వార్తలు