అప్పు బారెడు.. ఆస్తి మూరెడు

31 Jul, 2019 03:37 IST|Sakshi

నిబంధనలకు విరుద్ధంగా గత సర్కార్‌ అప్పులు

ఆర్థిక అకౌంట్ల నివేదికలో కాగ్‌ వెల్లడి 

కేంద్రం అనుమతించిన దాని కన్నా ఎక్కువగా రుణం 

ఆస్తుల కల్పనకు అరకొరగా అప్పుల నిధులు ఖర్చు

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలనలో గత ఐదేళ్లలో చేసిన అప్పులన్నీ నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించారు తప్ప ఆస్తుల కల్పనకు వినియోగించలేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, పెద్ద ఎత్తున వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌లతో పాటు ఓవర్‌ డ్రాఫ్టులకు వెళ్లిందని నివేదిక స్పష్టం చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అకౌంట్ల నివేదికను మంగళవారం అసెంబ్లీకి సమర్పించారు. ప్రతీ ఏడాది బడ్జెట్‌లోపల బహిరంగ మార్కెట్‌ నుంచి ప్రభుత్వం అప్పు చేస్తుంది. అలా చేసిన అప్పులను ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు గత ఐదేళ్లలో చేసిన అప్పులను అరకొరగా ఆస్తుల కల్పనకు మాత్రమే వినియోగించారు. అంతే కాకుండా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 22,800 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు అనుమతించగా రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగా అప్పు చేసినట్లు కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది.

2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు చంద్రబాబు సర్కార్‌ వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాఫ్టులకు వెళ్లింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 259 రోజులు,  2016–17లో 250 రోజులు, 2017–18లో 188 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌కు వెళ్లింది. 2017–18లో ఏకంగా 43 రోజల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లింది. అలాగే 14వ ఆర్థిక సంఘం, ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 25.09 శాతం ఉండాల్సి ఉండగా 2017–18లో ఏకంగా 32.30 శాతం అప్పులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2017–18 ఆర్థిక ఏడాది నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 2,59,670.02 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు