కాల్ నాగుల కాటు

2 Jun, 2016 01:32 IST|Sakshi
కాల్ నాగుల కాటు

చాపకింద నీరులా వడ్డీ వ్యాపారం
అనుమతి లేకుండానే కొనసాగింపు
గుంటూరులో దంపతుల బలవన్మరణం

 
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్‌మనీ వ్యవహారం మర్చిపోకముందే గుంటూరులో మరో విషాదం చోటుచేసుకుంది. కాలకూట విషపు నాగుల కాటుకు దంపతులు బలవన్మరణం చెందడం నగరవాసుల్లో విచారం నింపింది. అధికారం మాటున కొందరు వడ్డీ వ్యాపారులు అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం కనీసంగా స్పందించకపోవడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.- పట్నంబజారు(గుంటూరు)
 
 
పట్నంబజారు (గుంటూరు): గుంటూరు నగరం కాల్‌మనీ వ్యాపారానికి పెద్ద అడ్డాగా మారింది. మూడు పువ్వులు...ఆరు కాయలుగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఏ విధమైన అనుమతులు లేకుండానే కొందరు వడ్డీ వ్యాపారులు జనానికి కోట్లాది రూపాయలు అప్పులిచ్చి అంతకంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం బయటకు వచ్చిన సమయంలో కొద్దిగా హడావుడి చేసిన పలు శాఖల అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. కొంతకాలం కిందట బ్రాడీపేటకు చెందిన చిరు వ్యాపారి శ్రీరామమూర్తి వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే క్రమంలో బుధవారం కొత్తపేటకు చెందిన గండి నాగభూషణం, యామిని దంపతులు కాల్‌మనీ వ్యాపారుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు.

కొత్తపేటలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉండే నాగభూషణం (45) ఏలూరుబజారు, రైలుపేటల్లో జీడిపప్పు దుకాణాలు నిర్వహిస్తూ ఉండేవారు. వ్యాపారాభివృద్ధి కోసం అప్పులు చేశారు. వడ్డీలు అధికంగా వసూలుచేస్తున్నా కట్టుకుంటూ వస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం, వడ్డీల కోసం వ్యాపారుల వేధింపులు అధికమవడంతో దంపతులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ముఖేష్ ఇంటర్మీడియెట్, కుమార్తె మేఘన పదో తరగతి చదువుతున్నారు.


పోలీసులకు వడ్డీ వ్యాపారులపై ఫిర్యాదుల వెల్లువ...
ఇటీవల కాలంలో అర్బన్, రూరల్ జిల్లాల ఉన్నతాధికారులకు  వడ్డీ వ్యాపారుల వేధింపులపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు గ్రీవెన్స్‌కు 80 శాతం ఫిర్యాదులు కేవలం వడ్డీ వ్యాపారుల బాధితుల నుంచే వస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు, పరిసర ప్రాంతాల్లో రూ. 100కు రూ. 30 చొప్పున వడ్డీ వసూలు చేసే వ్యాపారులున్నారు. డొంకరోడ్డు, అరండల్‌పేట, బ్రాడీపేట, కొత్తపేట, పట్నంబజారు, లాలాపేట, ఆర్టీసీ బస్టాండ్, పరిసర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని అనుమతి లేని వడ్డీ వ్యాపార కార్యాలయాలు నిరాటంకంగా సాగుతున్నాయి.

పోలీసులకు వీరి గురించి పూర్తిగా తెలిసినప్పటికీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వడ్డీ వ్యాపారుల నివాసాలపై దాడులతో హడావుడి చేసిన అధికారులు ప్రస్తుతం మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే ఈ వడ్డీ వ్యాపారుల్లో ఎక్కువ మంది ఉన్నారు.
 
 
ఆస్తుల తాకట్టు పెడితేనే....
ప్రజల అవసరమే వడ్డీ వ్యాపారుల ఆయుధం. కేవలం వడ్డీ చెల్లిస్తామంటే అప్పులివ్వరు. స్థలాలు, ఇళ్లు, బంగారు నగలు తాకట్టు పెట్టుకొని మరీ డబ్బులిస్తారు. దీనికి తోడు నెలనెలా భరించలేని వడ్డీ ఉంటుంది. నెలల వ్యవధిలోనే వడ్డీని అసలుతో కలిపేసి చెల్లించాల్సిన మొత్తాన్ని వ్యాపారులు పెంచేస్తారు. అప్పు పెరిగిపోయి కట్టలేక వందలాది మంది తాము తాకట్టు పెట్టిన ఆస్తులను వడ్డీ వ్యాపారులకు రాసిన సంఘటనలు నగరంలో కోకొల్లలుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు