-

పావలా కోడికి..

27 Aug, 2015 04:29 IST|Sakshi
పావలా కోడికి..

సాక్షి ప్రతినిధి, కర్నూలు : పావలా కోడికి రూపాయి మసాలా చందంగా ఉంది కర్నూలు జిల్లా కేంద్ర సహకార(కేడీసీసీ) బ్యాంకు వ్యవహారం. రూ.60 లక్షలతో నిర్మించిన బిల్డింగ్‌కు.. ఏకంగా కోటి రూపాయలతో మరమ్మతులు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం నిర్వహించిన పాలక మండలి(బోర్డు) సమావేశంలో కేడీసీసీబీ ఆమోదముద్ర కూడా వేసింది. బిల్డింగ్ మరమ్మతులకు సహకార అభివృద్ధి నిధుల(సీడీఎఫ్) నుంచి కోటి రూపాయలను ఉపయోగిం చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆప్కాబ్‌కు కేడీసీసీబీ ఇప్పటికే లేఖ రాసింది. అనుమతి లభించిన వెంటనే మరమ్మతు పనులుకు టెండర్లు ఆహ్వానించేందుకు రంగం సిద్ధమయింది.

 30 ఏళ్లు కాకుండానే..
 కేడీసీసీబీని వాణిజ్య బ్యాంకుల తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ మరమ్మతులను చేపడుతున్నట్టు కేడీసీసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు వరకు బ్యాంకును విస్తరించేందుకు మరమ్మతులు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. బ్యాంకు నిధులు ఒక్క రూ పాయి కూడా ఉపయోగించమని.. సీడీఎఫ్ కింద జిల్లాకు వచ్చిన కోటి 60 లక్షల రూపాయల్లో.. కోటి రూపాయలను వినియోగించనున్న ట్టు స్పష్టం చేశారు. అయితే, బిల్డింగ్ నిర్మించి 30 ఏళ్లు కూడా పూర్తికాకుండానే.. పూర్తిస్థాయిలో మరమ్మతులను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బిల్డింగ్ నిర్మాణ వ్యయానికి మించి మరమ్మతులకు వెచ్చించాల్సిన అవసరం ఏముందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 ఇంకా టెండర్లు పిలవలేదు
 కేడీసీసీబీని వాణిజ్య బ్యాంకు తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ మరమ్మతు పనులను చేపట్టాలని భావిస్తున్నాం. ఇందుకోసం బ్యాంకు నిధులను ఒక్క పైసా వినియోగించం. సీడీఎఫ్ కింద రూ.1.60కోట్లు ఉన్నాయి. ఈ నిధులను ఉపయోగించుకోకపోతే వెనక్కు వెళ్లిపోతాయి. అయినా బిల్డింగ్‌ను పూర్తిగా పడగొట్టి కట్టడం లేదు. కేవలం మరమ్మతులు చేయించాలని నిర్ణయించాం. అనుమతి కోసం ఆప్కాబ్‌కు లేఖ రాశాం. మరమ్మతు పనులను ఓపెన్ టెండర్ల ద్వారా చేపడతాం. ఇందులో రహస్యమేమీ లేదు.
 - మల్లిఖార్జున రెడ్డి,కేడీసీసీబీ చైర్మన్

మరిన్ని వార్తలు