ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు

24 Feb, 2014 00:46 IST|Sakshi
సాక్షి, కాకినాడ :పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 70 కార్యదర్శుల పోస్టుల కోసం 44,535 మంది దరఖాస్తు చేయగా 30,427 మంది పరీక్షలకు హాజరయ్యారు. 14,108 మంది గైర్హాజరయ్యారు. 120 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన జనరల్‌స్టడీస్ పేపర్-1 పరీక్షకు కాకినాడ డివిజన్‌లో 15,168 మంది, అమలాపురం డివిజన్‌లో 3,854 మంది, పెద్దాపురం డివిజన్‌లో 5,231 మంది, రాజమండ్రి డివిజన్‌లో 6,174 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు జరిగిన పేపర్-2 పరీక్షకు కాకినాడ డివిజన్ లో 15,002, అమలాపురం డివిజన్‌లో 4,058, పెద్దాపురం డివిజన్‌లో 5,227, రాజమండ్రి డివి జన్‌లో 6,131 మంది హాజరయ్యారు. 
 
 మొత్తమ్మీద రెండు పేపర్లకు సంబంధించి 68.32 శాతం హాజరు నమోదైంది. జిల్లా పరిషత్ సీఈఓ ఎం.సూర్యభగవాన్ కో ఆర్డినేటర్‌గా జిల్లా వ్యాప్తంగా పరీక్షలను పర్యవేక్షించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్‌కు కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం, అమలాపురం ఆర్డీఓలు ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. 38 రూట్ లకు జిల్లా స్థాయి అధికారులను ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షల నిర్వహణ సజావుగా సాగింది. రామచంద్రపురం, రంపచోడవరం డివిజన్లు మినహా మిగిలిన నాలుగు డివిజన్లలో జరిగిన ఈ పరీక్షల కోసం జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి పరీక్షాకేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించారు. పరీక్షల అనంతరం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య కలెక్టరేట్‌లోని రిసెప్షన్ కౌంటర్‌కు సమాధానపత్రాలను చేర వేశారు.
 
మరిన్ని వార్తలు