సమన్వయం సాధ్యమా

9 Jun, 2014 00:17 IST|Sakshi
  •      మంత్రులిద్దరూ కలిసి పనిచేయడంపై అనుమానాలు
  •      ఇప్పటికీ గంటాపై అయ్యన్న గరంగరం
  •      జిల్లాలో పాలనపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
  •  సాక్షి,విశాఖపట్నం: జిల్లా టీడీపీలో మళ్లీ గ్రూపు రాజకీయాలు బలపడేందుకు బాటలు పడుతున్నాయి. రాజకీయ శత్రువులుగా మారిన అయ్యన్న-గంటాలకు మంత్రి పదవులు దక్కడంతో వీరిద్దరు మున్ముందు ఏవిధంగా కలిసి పనిచేస్తారనేదానిపై రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ అయ్యన్న గంటా పేరెత్తితేనే శివాలెత్తుతున్నారు.

    ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు గంటాశ్రీనివాసరావు తిరిగి టీడీపీలోకి చేరే ముందు గంటా రాక ను అయ్యన్న పాత్రు డు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే గంటా రాకను నిరసిస్తూ గళమెత్తారు. ఈనేపథ్యంలో ఇద్దరిమధ్య పరిస్థితి ఉప్పునిప్పుగా మారింది. చివరకు ఎన్నికల్లోనూ ఎవరికివారే ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీసుకునేలా పావులు కదిపారు. తీరా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వీరిద్దరు క్యాబినేట్ మంత్రులుగా పదవులు దక్కడంతో పార్టీలో విభేదాలు మరింత పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
     
    వాస్తవానికి జిల్లా మం త్రులు మూడునెలలకోసారి నిర్వహించి జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ), జిల్లాపరిషత్ సమావేశం,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పరిస్థితి ఏమిటన్న వాదన వ్యక్తమవుతోంది. వాస్తవానికి గంటాశ్రీనివాసరావును అయ్యన్నపాత్రుడు టీడీపీలో ప్రోత్సహించారు. 1999లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి గంటా పోటీచేసినప్పుడు అయ్యన్న సహకారం అం దించారు. కాని తర్వాత ఇద్దరిమధ్య విభేదాలు పెరిగాయి. ఒకరినొకరు విమర్శించుకునే వరకు పరిస్థితి  వెళ్లింది.

    2009లో గంటా టీడీపీని వదిలి పీఆర్పీలో చేరారు. అప్పటినుంచి ఇద్దరిమధ్య దూరం మరింత పెరిగింది. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక గంటా 2012లో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అయ్యన్న ప్రతిపక్ష హోదాలో గంటాపై అనేకసార్లు విమర్శలు ఎక్కుపెట్టారు. గంటాలాంటి అవితీనిపరుడికి ప్రజలు బుద్ధిచెబుతారని అప్పట్లో పలుమార్లు వ్యాఖ్యానించారు.
     
    రాజీ సంకేతాలు బేఖాతరు

    గంటా రాకను అయ్యన్న తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికలకు ముందు విశాఖలో చంద్రబాబు నిర్వహించిన ఆరో ప్రజాగర్జన బహిరంగ సభలోనూ అయ్యన్న గంటాకు చుక్కలు చూపించారు. ‘ఇవాళ టీడీపీలోకి కొందరు వచ్చారు. వాళ్లు ఎంతకాలం ఉంటారో పోతారో తెలీదు’ అంటూ నర్మగర్భంగా బాబు ముందే విమర్శించారు. దీంతో గంటా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆతర్వాత చంద్రబాబును కలిసి అయ్యన్న తనను అదేపనిగా ఇరుకున పెడుతున్నారని వాపోయారు.

    తాను మాత్రం రాజీకి సిద్ధమని అయ్యన్నకు ప్రత్యక్షంగా,పరోక్షంగా సంకేతాలు పంపారు. అయినా అయ్యన్న మాత్రం గంటాపై ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. ఇలా ఒకరికొకరికి పడని పరిస్థితుల్లో మున్ముందు జిల్లా పాలన ఎలా ఉంటుందనే ఊహాగానాలు వెలువుడుతున్నాయి. జిల్లాలోని టీడీపీ కేడర్ ఇప్పటికే గంటా-అయ్యన్న వర్గాలుగా విడిపోయి ఉంది. ఆయన్ను కలిసే నేత ఈయన్ను కలవడంలేదు. ఇదే విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
     

మరిన్ని వార్తలు