అనుమతిలేని క్వారీ.. అక్రమాల దారి

3 Mar, 2016 01:01 IST|Sakshi

కోర్టు ఆదేశాలు బేఖాతరు
అనుమతులు లేకుండానేయథేచ్ఛగా అమ్మకాలు
పనిచేయని సీసీ కెమెరాల   వెనుక మర్మమేమిటి?

 
తాడేపల్లి రూరల్ : కోర్టు ఆదేశాలకు తిలోదకాలిచ్చి పెనుమాక ఇసుక రీచ్‌లో బుధవారం యథేచ్ఛగా ఇసుక అమ్మకాలు జరిపారు. ప్రభుత్వం తరఫున క్వారీ నిర్వహణా బాధ్యతలు చూసే ఏసీఎం శ్రీధర్ అనుమతితోనే ఇదంతా జరిగిందని, డీఆర్‌డీఏ పీడీ బి.శ్రీనివాసరావు ఇసుక అమ్మకాలు నిర్వహించమన్నట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తమకు అందాల్సిన లెక్కల్లో తేడాలు రావడంతో సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లు అధికారులను వెంటబెట్టుకుని క్వారీలో హల్‌చల్ చేశారు. దీంతో కంగారు పడిన ఏపీఎం లోడింగ్‌ను నిలిపివేశారు. రెవెన్యూ అధికారి దుర్గారావు, ఎస్‌ఐ వినోద్‌కుమార్ అనుమతి పత్రాలు చూపించమని కోరడంతో ఏపీఎం శ్రీధర్ మాత్రం తమ వద్ద పత్రాలు లేవని, జిల్లా డీఆర్‌డీఏ పీడీ అనుమతి ఇచ్చారంటూ జవాబిచ్చారు. దీంతో క్వారీ  నిర్వహించవద్దంటూ సూచించి ఎటువంటి చర్యలు తీసుకోకుండానే అధికారులు వెనుదిరిగారు.

‘నిఘా’ నిర్వాహకుల చేతుల్లోనే..
ఇసుక క్వారీలో అక్రమాలు జరక్కుండా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలు నిర్వాహకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం సీసీ కెమెరాలు పాడయ్యాయని చెప్పిన నిర్వాహకులు.. అధికారుల రాకతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఉదయం కరకట్ట రోడ్డు దృశ్యాలను చూపిన కెమారాలు అధికారులు వచ్చేసరికి క్వారీ నిర్వహణను చూపిస్తున్నాయి. అంటే అక్రమాలను కప్పిపుచ్చడానికే సీసీ కెమెరాలను నిర్వాహకులు తమకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. మొదటి నుంచీ పెనుమాక క్వారీలో అక్రమాలు జరుగుతున్నా కన్నెత్తి చూడని రెవెన్యూ, పోలీస్ అధికారులు స్థానికి టీడీపీ నాయకులు ఆరోపిస్తే గానీ క్వారీకి రాకపోవడం విడ్డూరం. స్వయానా అధికార పార్టీ నాయకులే క్వారీ నిర్వహణపై ఆరోపణలు చేస్తుంటే ఇక్కడ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
కొసమెరుపు ఏమిటంటే..

పెనుమాక ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టడానికి టీడీపీ మండల నాయకులు ఆరు నెలల తరువాత నోరు విప్పడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయన్న సదరు నేత గ్రామంలో రాత్రీ పగలూ తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే.. స్థానిక యువకులు ఫిర్యాదు చేశారంటూ వారిపై దాడికి పాల్పడడమే కాకుండా, ఆయనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. ఇప్పుడు మాత్రం తాము నీతిమంతులమంటూ ఇసుక అక్రమాలను అడ్డుకుంటాం.. సీఎం దృష్టికి తీసుకువెళ్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ ప్రకటనలు కూడా తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను టార్గెట్ చేసుకుని మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులు స్థానిక టీడీపీ నేతలకు వాటా ఇవ్వకుండా ఇసుక రీచ్ నిర్వహించడం వల్లే ఈ తతంగం జరుగుతోందని డ్వాక్రా మహిళలే విమర్శిస్తున్నారు. క్వారీలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎందుకు బయటపెట్టడం లేదో అర్థం కావడం లేదంటూ బోట్‌మన్ సొసైటీ సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం.  
 
 

మరిన్ని వార్తలు