60% కంటే తక్కువహాజరుంటే పరీక్ష రాయలేరు

22 Dec, 2018 04:34 IST|Sakshi

ఇంటర్మీడియెట్‌ సైన్స్‌ విద్యార్థులకు నిబంధన 

ఇతర సబ్జెక్టుల విద్యార్థులకు తక్కువ హాజరుంటే కాండినేషన్‌ ఫీజు చెల్లించాల్సిందే 

రూ.2,000 అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు 

జంబ్లింగ్‌ విధానంలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ఇకపై రెండో సంవత్సరం విద్యార్థులకూ గ్రేడింగ్‌ 

శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు 60 శాతం హాజరు ఉంటేనే వార్షిక పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి రానుంది. గతేడాది కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ అప్పట్లో ఆన్‌లైన్‌ హాజరు విధానం లేకపోవడం వల్ల కచ్చితంగా అమలయ్యేది కాదు. ఈ ఏడాది బయోమెట్రిక్, ఆన్‌లైన్‌ హాజరును ప్రవేశపెట్టడంతో విద్యార్థి హాజరు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దీంతో ఇకపై 60 శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలయ్యే అవకాశం ఉంది. సైన్స్‌ తప్ప మిగిలిన ఇతర సబ్జెక్టుల విద్యార్థులకు 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే వారి నుంచి కాండినేషన్‌ ఫీజు వసూలు చేసి పరీక్షకు అనుమతిస్తారు. 10 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.200, 18 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.250, అంతకంటే హాజరు తక్కువగా ఉంటే రూ.400 కాండినేషన్‌ ఫీజుగా వసూలు చేస్తారు. 

డిసెంబర్‌ 28 వరకు గడువు 
ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసినా, రూ.2,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశాన్ని ఇంటర్‌ బోర్డు తాజాగా కల్పించింది. వచ్చే ఏడాది ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల్లో తొలిసారిగా జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్‌ ప్రారంభం కానున్నాయి. వీలైనంత వరకు ఈ పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా అధికారులకు జారీ చేసింది. 

సెకండియర్‌కు గ్రేడింగ్‌ విధానం 
ఈ ఏడాది నుంచి ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. గతేడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేశారు.
 
పరీక్షల నిర్వహణపై సందేహాలు 
వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి మాసాంతం నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. మార్చి నెలలో ఎన్నికలు వస్తే ఇంటర్‌ పరీక్ష నిర్వహణ కష్టసాధ్యమవుతుందని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు