కాలువలో కన్నీళ్లు

17 Sep, 2014 23:51 IST|Sakshi
కాలువలో కన్నీళ్లు
సా..గుతున్న హంద్రీనీవా పనులు
 
 కర్నూలు రూరల్: కరువు సీమలో సిరుల పంటలు పండించేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రైతన్న ఆశలతో దోబూచులాడుతోంది. భారీ వర్షాలతో జిల్లాలోని జలాశయాలన్నీ జల కళ సంతరించుకున్నా.. హంద్రీనీవా నీరు ఖరీఫ్‌కు అండగా నిలవలేకపోతోంది. ఆయకట్టు పంటలు చివరి దశకు చేరుకున్నా.. చుక్క నీరు విడుదల కాకపోవడం అన్నదాతను నిరాశకు గురిచేస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది హంద్రీనీవా లక్ష్యం. జూలై 24, 2004న హంద్రీనీ ఫేజ్-1 పనులకు అప్పటి ప్రభుత్వం రూ.1,305 కోట్లతో పరిపాలన అనుమతులు 
 మంజూరు చేసింది. ఆ తర్వాత అంచనా వ్యయం రూ.2,774 కోట్లకు చేరుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం హంద్రీనీవా పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. సకాలంలో పనులు పూర్తి కాకపోయినా నవంబర్ 18, 2012న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ట్రయల్ రన్ చేపట్టారు. మొత్తం 114 కిలోమీటర్ల మేర మెయిన్ కాలువ, ముచ్చుమర్రి ఎత్తిపోతలతో కలిపి కాలువపై 9 లిఫ్ట్‌లు నిర్మించారు. కాలువ పరిధిలో క్రిష్ణగిరి రిజర్వాయర్ (0.161 టీఎంసీ), పత్తికొండ రిజర్వాయర్(1.126 టీఎంసీ), జీడిపల్లి రిజర్వాయర్(1.694 టీఎంసీ)లు ఉన్నాయి. స్కీమ్ నిర్మాణానికి 9493.45 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 8509.39 ఎకరాలను సేకరించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు 8081.06 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికీ 428.33 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. కాలువకు లైనింగ్ లేకపోవడంతో వర్షపు నీటి తాకిడికి గండ్లు పడ్డాయి. ప్రధాన కాలువ నుంచి పంట పొలాలకు నీటిని తీసుకెళ్లే పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులు 30 శాతం కూడా పూర్తి కాలేదు. అసంపూర్తి పనులతోనే గతేడాది ఖరీఫ్‌లో కర్నూలు, అనంతపురం జిల్లాలో 28వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ చివరి దశకు వచ్చినా సాగుకు నీరు విడుదలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం గమనార్హం. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు  భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీరు పూర్తి సామర్థ్యంకు చేరడంతో దిగువనున్న సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తోంది. హంద్రీనీవా ద్వారా సాగునీరు విడుదల చేయాలని అధికారులు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అనంపురం జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురవక ఆయకట్టు రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 25వేల ఎకరాల ఆయకట్టు.. కర్నూలు, అనంతపురం జిల్లాల దాహార్తి తీర్చేందుకు పది టీఎంసీ నీటికి ఆగస్టు నెలలో హంద్రీనీవా అధికారులు ఇండెంట్ పెట్టారు. అయితే తాగునీటి కోసమని రెండు టీఎంసీ నీటిని 700 క్యూసెక్కుల ప్రకారం నీటిని మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేస్తున్నారు. పాలకుల తీరుతో సాగునీటి కోసం నిర్మించిన హంద్రీనీవా తాగునీటి పథకంగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 నేడు హంద్రీనీవా కాలువపై 
 మంత్రి పర్యటన
 రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం హంద్రీనీవా కాలువపై పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహం నుంచి బయలుదేరి మల్యాల చేరుకుంటారు. అక్కడి నుంచి గుంతకల్లు.. ఆ తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ వరకు కాలువను పరిశీలించనున్నారు.
 
 

 

మరిన్ని వార్తలు