సంక్రాంతి సంబరాల్లో...కానరాని కాంతి

18 Jan, 2015 07:26 IST|Sakshi
  • ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వం
  •  సకాలంలో అందని నిధులు
  •  మండలాల్లో తూతూ మంత్రంగా నిర్వహణ
  •  విజయవాడ, బందరులోనే బెటర్
  •  మంత్రి కామినేని డుమ్మా
  • సాక్షి నెట్‌వర్క్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సంక్రాంతి సంబరాలు జిల్లాలో తూతూమంత్రంగా సాగాయి. ఈ సంబరాల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు అధికారులకు సకాలంలో అందలేదు. దీంతో వారు తమ సొంత నిధులు, ఇతర పద్దుల నుంచి సేకరించి సంబరాలను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర పాల్గొన్న విజయవాడ, బందరుల్లో మాత్రం సంబరాలు కాస్తోకూస్తో ఘనంగా జరిగాయి.

    కైకలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద  బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొంటారని అధికారులు భావించినా ఆయన డుమ్మా కొట్టడంతో అధికారులే సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తొలిసారిగా వచ్చిన సంక్రాంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క జిల్లాకు కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

    మండలానికి, మున్సిపాలిటీకి లక్ష చొప్పున, కార్పొరేషన్‌కు రెండు లక్షల రూపాయలు చొప్పున నిధులు కేటాయించాలని ఆదేశించింది. అవి జిల్లా స్థాయి అధికారులకు 13వ తేదీ వరకు అందలేదు. 14 నుంచి పండుగ ప్రారంభం కావడంతో జిల్లా అధికారులకు వచ్చిన నిధుల్ని మండల స్థాయి అధికారులకు పంపిణీ చేయలేకపోయారు. సకాలంలో నిధులు అందకపోవడంతో ఎంపీడీవోలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు.
     
    ప్రచారం శూన్యం.. టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యం...


    చివరి నిమిషం వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సంబరాల నిర్వహణకు అధికారులు నానా ఇబ్బంది పడ్డారు. దీంతో సంబరాల గురించి గ్రామస్థాయిలో పెద్దగా ప్రచారం జరగలేదు. మండల స్థాయి అధికారులు టీడీపీ నేతలను, కార్యకర్తలను పిలిచి నామమాత్రంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సంబరాల నిర్వహణ ఖర్చులను బాగా కుదించుకుని పొదుపుగా జరిపారు. ముగ్గుల పోటీల్లో అనేకచోట్ల ముగ్గు, రంగులు మహిళలే తెచ్చుకోవాలనే నిబంధన విధించారు. వారికి ఇచ్చే బహుమతులు కూడా నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఇక కబడ్డీ, ఖోఖో వంటి పోటీలు నిర్వహించినా వచ్చిన క్రీడాకారులకు అధికారులు చుక్కలు చూపించారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదు.
     
    సంబరాలు సాగిన తీరిదీ...

    జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు మున్సిపాలిటీల్లో కేవలం ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేవారు వారి సామగ్రిని వారే తెచ్చుకోవాలని చెప్పారు. పెడన మున్సిపాలిటీ, మండలం కలిపి ఒకేచోట సంబరాలు నిర్వహించి ఖర్చును బాగా తగ్గించుకున్నాయి. పెనుగంచిప్రోలు మండలంలో జరిగిన కబడ్డీ పోటీల్లో కేవలం రెండే టీమ్‌లు పాల్గొనగా వారికే ఒకటి రెండు బహుమతులు ఇచ్చారు. కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో నామ్‌కే వాస్తే సంబరాలు చేశారు.

    గంగిరెడ్లు, హరిదాసులు, భోగిమంటలు వంటివి కానరాలేదు. పోటీదారులకు మంచినీరు కూడా అందజేయలేదు. ఆయా మండలాల్లో రూ.10 వేల నుంచి 20 వేలు ఎంపీడీవోలు ఖర్చు చేశారు. నందిగామ నియోజకవర్గం వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో నానా ఇబ్బందులు పడ్డారు. సంబరాలు అంతంతమాత్రంగానే జరిగాయి. జనరల్ ఫండ్ నుంచి రూ.20 వేలు, స్థానిక ఎంపీపీ పాటిబండ్ల జయపాల్ సొంత నుధుల నుంచి రూ.30 వేలు తీసుకుని ఖర్చు చేశారు. ఆగిరిపల్లి మండలంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు కేవలం ప్రశంసాపత్రం ఇచ్చి సరిపెట్టారు.
     
    విజయవాడ, బందరులలో...

    విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఈనెల 13న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు నాలుగు గంటల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బందరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో వివిధ రకాల పోటీలతో పాటు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఇతర శాఖల అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
     
    బిల్లులు సిద్ధం చేస్తున్న అధికారులు.

    సంక్రాంతి సంబరాల చెక్కులను ప్రస్తుతం ఎంపీడీవోలకు జిల్లా రెవెన్యూ అదికారులు అందజేస్తున్నారు. తొలుత తూతూ మంత్రంగా నిధులు ఖర్చు చేసినా ఇప్పుడు లక్ష రూపాయలకు అధికారులు బిల్లులు సిద్ధం చేస్తున్నారు. అయితే సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ఆదేశించారే తప్ప ఏయే పద్దుల కింద ఎంత ఖర్చుచేయాలో చెప్పలేదని, ఇప్పుడు ఏ బిల్లులు ఇస్తారో, ఏవి తిరస్కరిస్తారో అర్థం కావడం లేదని మండల అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు