టీడీపీ గుర్తింపును రద్దు చేయాలి

10 Jul, 2014 00:24 IST|Sakshi
టీడీపీ గుర్తింపును రద్దు చేయాలి

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు జగన్ లేఖ
‘స్థానికం’లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఫిర్యాదు
13న జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి


హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, అధికార దుర్వినియోగం, అరాచకాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.  ఈ నెల 13న జరగనున్న జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ అధ్యక్ష పదవుల ఎన్నికలకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. వైఎస్సార్ సీపీ సభ్యులను దౌర్జన్యంగా లాక్కుని వెళుతున్నా, టీడీపీ నేతలతో కుమ్మక్కయి చోద్యం చూస్తూ ఉండిపోయిన జిల్లా కలెక్టర్, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్ రాసిన లేఖను పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, శాసన సభాపక్షం ఉప నేతలు ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, కోన రఘుపతి, ఆదిమూలం సురేష్ తదితరులు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంతరెడ్డికి అందజేశారు. స్థానిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడి, అధికారులకు విధి నిర్వహణలో అడ్డు తగిలిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిన ఆదేశాల ప్రతిని రమాకాంతరెడ్డి వైఎస్సార్ సీపీ నేతలకు అందజేశారు. అధికారులకు అడ్డుతగిలిన వారి మీద  కేసులు పెడతామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు : మైసూరారెడ్డి

స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు ఇచ్చి బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వాటిని బలహీనపర్చే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని మైసూరారెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళ్ల ముందే టీడీపీ వారు దౌర్జన్యానికి పాల్పడుతుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలహీనులుగా చేష్టలుడిగి చూస్తూ కూర్చోవడం ఏమిటని ప్రశ్నించారు.
 

>
మరిన్ని వార్తలు