నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

29 Mar, 2018 03:55 IST|Sakshi

3 రోజులు ఆర్జిత సేవలు రద్దు 

తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడి 

తిరుపతిఅర్బన్‌: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను గురువారం నుంచి శనివారం వరకు 3 రోజులు నిర్వహించనున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. బుధవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణిమకు ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తొలిరోజైన గురువారం ఉద యం 8 గంటలకు శ్రీదేవి–భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి వేంచేస్తారని తెలిపారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు, ఆస్థానం పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారన్నారు.

రెండోరోజైన శుక్రవారం నాడు మలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 9 వరకు స్వర్ణ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమివ్వనున్నట్లు చెప్పారు. చివరిరోజున మలయప్పస్వామి వారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్లి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయాన్ని చేరుకుంటారని వివరించారు. వసంతోత్సవాలను పురస్కరించుకొని 3 రోజుల్లో నిర్వహించాల్సిన ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసినట్లు చెప్పారు. గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శన సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు